Wednesday , July 24 2024

తాగు నీటి సరఫరా లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలివిజయేంద్ర బోయ అధికారులకు సూచించారు_.

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (ఏప్రిల్ 08)

 _తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా  ప్రణాళికా బద్దంగా చర్యలు చేపట్టాలని  రాష్ట్ర రవాణా, రోడ్లు మరియు భవనముల శాఖ ప్రత్యేక కార్యదర్శి,జిల్లా ప్రత్యేక అధికారిగా నియమితులైన విజయేంద్ర బోయ అధికారులకు సూచించారు. కలెక్టరేటులోని సమావేశ మందిరంలో ప్రత్యేక అధికారి విజయేంద్ర బోయ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ లతో కలిసి తాగునీటి సరఫరా పై  జడ్పి సీఈవో, డిపిఓ , మిషన్ భగీరథ, మున్సిపల్ కమిషనర్లు సంబంధిత శాఖల అధికారులతో  సమీక్ష నిర్వహించారు. 
ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి విజయేంద్ర బోయ మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి సరఫరా అంశం అత్యంత కీలకమైనదని, దీనిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యతనిస్తూ అనునిత్యం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షింస్తూ తాగునీటి సమస్య రాకుండా చూడాలన్నారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైన ఉందని తెలిపారు.ఎక్కడైనా నీటి ఎద్దడి తలెత్తితే వెంటనే యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని తెలిపారు.
అవసరమైన చోట చేతి పంపులు, బోరు మోటార్లు, పైప్ లైన్ల మరమ్మతులు వంటివి సకాలంలో చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలన్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, నీటి ఎద్దడి కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారనే మాటకు అస్కారం లేకుండా బాధ్యతాయుతంగా, అంకిత భావంతో ప్రతి ఒక్కరు విధులు నిర్వర్తించాలని సూచించారు.
అవసరమైన చోట నీటి రవాణా కోసం ట్యాంకర్లను వినియోగించాలని తెలిపారు. జిల్లాలోని మండలాల పరిధిలో గల నివాస ప్రాంతాలకు సరిపడా నీటి నిలువలు అందుబాటులో ఉన్నాయా లేదా అన్న అంశం మీ అందరికీ అవగాహన ఉండాలని, అవగాహన ఉంటే సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే పరిష్కరించడాని వీలవుతుందని అన్నారు.
మండల ప్రత్యేక అధికారులతో పాటు తహసీల్దార్లు, ఎంపిడిఓలు క్షేత్ర స్థాయిలో నీటి సరఫరా తీరును అనునిత్యం పర్యవేక్షణ జరపాలని సూచించారు. స్పెషల్ ఆఫీసర్లు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తూ, ఎక్కడైనా లోపాలు గమనించిన వెంటనే వాటిని సరిదిద్దాలని, తాగునీటి వ్యవస్థకు ఇబ్బంది తలెత్తకుండా అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.
ముఖ్యంగా మిషన్ భగీరథ ద్వారా పూర్తి స్థాయిలో నిర్ణీత పరిమాణంలో నీటి సరఫరా జరుగుతోందా లేదా అన్నది మండల అధికారులు, గ్రామ పంచాయతీల కార్యదర్శులు సరి చూసుకోవాలని అన్నారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పని చేస్తూ ప్రస్తుత వేసవిలో ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ నీటి సమస్య రాకుండా నిబద్దతతో పని చేయాలని సూచించారు.

హెల్ప్ డెస్క్ కంట్రోల్  నంబర్ 08416-242136 

త్రాగునీటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా
కలెక్టరేట్ లో త్రాగునీటి కోసం హెల్ప్ డెస్క్ కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ప్రారంభించారు.
ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో, మున్సిపల్ పరిధిలో ప్రతి ఒక్కరి త్రాగునీటి సమస్యను తెలుసుకునేందుకు వీలుగా 08416-242136 టోల్ ఫ్రీ నంబర్ హెల్ప్ డెస్క్ కు ఫోన్ చేయాలని కలెక్టర్ సూచించారు.ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా కార్యచరణ ప్రణాళిక రూపొందించుకొని జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో తాగునీటి సరఫరా పర్యవేక్షణకై జిల్లా అధికారులను మండల స్పెషల్ ఆఫీసర్లుగా నియమించడం జరిగిందన్నారు.మున్సిపల్ పరిధిలో మున్సిపల్ కమిషనర్లు, గ్రామాలలో గ్రామ పంచాయతీల కార్యదర్శులు పర్యవేక్షణ జరిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని నివాస ప్రాంతాలలో నీటి కొరతను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అంతేకాకుండా ఎక్కడ నీటి సరఫరాకు ఆటంకాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నామని, అవసరమైన చోట బోరు మోటార్లు, చేతి పంపులు, ఇతర తాగునీటి వనరులకు మరమ్మతు పనులు జరిపిస్తామని అన్నారు.జిల్లా స్థాయి అధికారులు మారుమూల ప్రాంతాలను సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ నారాయణ అమిత్ , మిషన్ భగీరథ ఎస్ఈ ఆంజనేయులు, జెడ్పి సీఈఓ సుధీర్, డిపిఓ జయసుధ, డివిజనల్ పంచాయతీ అధికారులు సంధ్యారాణి, శంకర్ నాయక్, మిషన్ భగీరథ డిఇ లు సుబ్రహ్మణ్యం, రత్న ప్రసాద్, శశాంక్ మిశ్రా , మున్సిపల్ కమిషనర్లు జాకీర్ అహ్మద్, వెంకటయ్య,బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.