తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (ఫిబ్రవరి 18)
ఈరోజు కలెక్టర్ చాంబర్ నందు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని అన్నారు.
రాజకీయ పార్టీలకు, నాయకులకు, అభ్యర్థులకు ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతులు తీసుకోవాలని, కనీసం 48 గంటల ముందు సువిధ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీలులేదని అన్నారు.
మతం, కులం, ప్రాంతీయ అంశాలను ప్రస్తావిస్తూ విద్వేషాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడటం, తప్పుడు ప్రచారాలు చేయడంపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థన స్థలాల్లో, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించరాదని తెలిపారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు జిల్లాలో ఎం.సి.సి,సర్వేలెన్స్ బృందాలను, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను,వీడియో సర్వేలెన్సు బృందాలను, ఎం.సీ.ఎం.సీ కమిటీ, ఇతర కమిటీలను ఏర్పాటు చేశామని అన్నారు.ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ఫిర్యాదులను 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా, సి-విజిల్ యాప్ ద్వారా చేయవచ్చని సూచించారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున రాజకీయ పార్టీలకు సంబంధించిన వాల్ రైటింగ్, ఫ్లెక్సీలు, హోర్డింగులు,ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో 24 గంటల వ్యవధిలో, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ పెట్రోల్ బంక్ తదితర పబ్లిక్ ప్లేస్ లలో 48 గంటల వ్యవధిలో,అనుమతి లేని ప్రైవేట్ స్థలాలలో 72 గంటల వ్యవధిలో పూర్తి స్థాయిలో తొలగించాలన్నారు.
కాగా, జిల్లాలో కరపత్రాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ముద్రించే సమయంలో ప్రింటింగ్ ప్రెస్ ఫోన్ నెంబర్, అదేవిధంగా ఎవరు ప్రింట్ చేయమన్నారు వారి ఫోన్ నెంబర్ తప్పనిసరిగా పేర్కొనాలని,ఈ అంశాన్నిఅన్ని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు పాటించాల్సి ఉంటుందన్నారు.ఎన్నికల ప్రచార ప్రకటనలు, కరపత్రాలలో ముద్రించే అంశాలు, ఇతర ప్రచార అంశాలకు సంబంధించి తప్పనిసరిగా ఎం.సీ.ఎం.సీ ద్వారా ముందస్తుగానే అనుమతి తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంగిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని,దీనిని పరిగణలోకి తీసుకొని సజావుగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన రేట్ చార్ట్ ప్రకారం ఎన్నికల వ్యయాన్ని లెక్కించడం జరుగుతుందన్నారు.
సమావేశం లో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, జడ్ పి సి ఇ ఓ సుదీర్, ఆర్ డి ఓ వంశీ చంద్ర, ఎన్నిల విబాగం సుపరింటేన్దేంట్ శ్రీనివాస్ , వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు,తదితరులు ఉన్నారు.