Wednesday , September 18 2024

తెలంగాణ కెరటం వార్తకు అధికారుల స్పందన..??

విచారణ ప్రారంభం కానే లేదు….
విచారణ అధికారిని తప్పించారు

కామారెడ్డి జిల్లా విద్యాశాఖలో ఏం జరుగుతుంది?

అక్రమార్కులపై చర్యలేవి?

కామారెడ్డి జిల్లాలో ఇటీవల జరిగిన ఓపెన్ 10వ తరగతి పరీక్షల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. ప్రశ్నాపత్రాలను పరీక్ష కేంద్రాలను దాటించి వేరే గదులలో కూర్చోబెట్టి పరీక్షలు రాయించారు. దానికి గాను ఒక్కొక్క అభ్యర్థి నుండి 15వేల నుండి 20వేల వరకు వసూలు చేశారు. పరీక్ష రాసే అభ్యర్థులకు బదులు వేరే అభ్యర్థులతో పరీక్షలు రాయించి లక్షల రూపాయలు ఆర్జించారు. ఈ వ్యవహారాన్ని తెలంగాణ కెరటం ప్రతినిధి సాక్షాలతో సహా వార్తలను ప్రచురించారు. ఈ ఘటనలో ఎంఈఓ ఎల్లయ్యకు భాగస్వామ్యం ఉందని ఆధారాలతో సహా వార్తలు రాసినప్పటికీ ఇట్టి అక్రమాలపై విచారణ జరిపే కమిటీ లో ఎంఈఓ ఎల్లయ్యకు విచారణ కమిటీ బాధ్యతలు అప్పగించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఏ విధంగా విచారణ కమిటీ బాధ్యతలు అప్పగిస్తారని తెలంగాణ కెరటం తెలుగు దినపత్రికలో మళ్ళీ వార్తా కథనాలు ప్రచురించడంతో సంబంధిత ఎంఈఓ ఎల్లయను విచారణ కమిటీ నుండి తప్పించారు. అన్ని ఆధారాలతో ఈనెల ఆరవ తేదీన కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. అయినా అక్రమార్కులకు అండగా ఉన్న డిఇఓ రాజు అట్టి మాస్ కాపీయింగ్ ప్రోత్సహించి అక్రమార్జానకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఈఓ ఎల్లయను విచారణ కమిటీ లో నియమించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తెలంగాణ కెరటం వరుస కథనాలలో ప్రచురించడంతో జిల్లా విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది విచారణ ప్రారంభం కాకముందే అట్టి కమిటీని రద్దుచేసి మరొక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఆరో తేదీన ఫిర్యాదు చేసినప్పటికీ అట్టి ఫిర్యాదులను తుంగలో తొక్కి తామేం చేసినా చెల్లుతుందని జిల్లా విద్యాశాఖ అధికారులు భావించారు. తెలంగాణ కెరటం దినపత్రికలో వరుస కథనాలు ప్రచురించడంతో 11వ తేదీన విచారణ కమిటీని మార్చి కొత్త విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆర్డర్ రిలీజ్ చేశారు. ఇప్పటికైనా ఓపెన్ టెన్త్ పరీక్షలలో జరిగిన మాస్ కాఫీ మరియు అవినీతిపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత ఉద్యోగులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఎంఈఓ ఎల్లయ్య పై చర్యలు లేనట్టేనా?

ఓపెన్ టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ మరియు అక్రమ వసూళ్లలో భాగస్వామిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎంఈఓ పై ఏం చర్యలు తీసుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆరోపణలు రావడంతోనే విచారణ కమిటీ నుండి ఎంఈఓ ఎల్లయ్యను మార్చామని చెబుతున్నప్పటికీ ఇప్పటివరకు ఏలాంటి షోకాజ్ నోటీసు జారీ చేయకపోవడంతో ఆయనపై అధికారులకు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది. అసలు సూత్రధారులను పక్కకు తప్పించి చిన్నస్థాయి ఉద్యోగులను బలి చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేకమైన చొరవని తీసుకొని ఓపెన్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి అట్టి అక్రమాలలో భాగస్వామ్యం ఉన్న ఉద్యోగులందరిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి చర్యలు పునరావృతం అవుతున్నాయని ప్రజలు ఆరో పిస్తున్నారు.