Wednesday , July 24 2024

గురుకుల పాఠశాల మరో విద్యార్థిని ఆత్మహత్య

వరుస ఘటనలతో ఆందోళనలో విద్యార్థులు

తెలంగాణ కెరటం సూర్యాపేటజిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 18 : సూర్యాపేట మండలం ఇమాంపేట వద్ద గల ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల లో మరో విద్యార్థిని శనివారం ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగించింది. ఇటీవలనే అదే గురుకుల కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం బైపిసి చదువుతున్న విద్యార్థిని డి వైష్ణవి కళాశాలలో ఫేర్వెల్ పార్టీ జరిగిన సాయంత్రమే ఉరివేసుకొని మరణించింది ఈ విషయమై మృతురాలి బంధువులు విద్యార్థి సంఘాలు ప్రజాసంఘాలు రాస్తారోకో ధర్నాలు చేయడంతో దిగివచ్చిన ప్రభుత్వ అధికారులు గురుకుల కళాశాల ప్రిన్సిపల్ శుక్రవారం సస్పెండ్ చేశారు. ఆ సంఘటన మరువకముందే తాజాగా అదే గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న సూర్యాపేట జిల్లా మోతే మండలం బురకచర్ల గ్రామ పరిధి కి చెందిన ఇరుగు ఆనంద్ జ్యోతిల కుమార్తె ఇరుగు అస్మిత ( 15) శనివారం ఉరివేసుకొని మరణించింది. ఈ నెల 10న ఇంటర్ విద్యార్థిని వైష్ణవి మృతి చెందడంతో విద్యార్థులు భయపడకుండా ఉంటానికి పాఠశాల కళాశాలకు నాలుగు రోజులు (హోం సిక్ ) సెలవులు ప్రకటించారు. దీంతో అస్మిత సెలవులలో హైదరాబాద్ కు వెళ్ళింది. శనివారంతో సెలవులు అయిపోతునందున పాఠశాలకు వెళ్దామని చెప్పిన అస్మిత తల్లి తన పనులకు వెళ్లి తిరిగి వచ్చేసరికి అస్మిత ఇంట్లోనే ఫ్యాన్ కు సున్నితో ఉరివేసుకుంది. పాఠశాలకు వెళ్లాల్సిన రోజే అస్మిత ఉరివేసుకోవడం మిస్టరీగా మారింది. ఇటీవల ఆత్మ హత్య చేసుకున్న వైష్ణవి రూమ్ లోనే అస్మిత కూడా ఉంటుందని సమాచారం. ఒకే గదిలో ఉంటూ ఆత్మహత్య చేసుకున్న వైష్ణవి తో ఉన్న అస్మిత వైష్ణవి మరణంతో బాగా డిప్రెషన్ కు గురైనట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పాఠశాలకు వెళ్లాలని తల్లి చెప్పటం, తల్లి చెప్పిన అనంతరం తన పనుల్లోకి తల్లి వెళ్లి పోవడంతో అప్పటికప్పుడు చావాలని నిర్ణయించుకుందా, లేదా అంతకుముందే చనిపోవాలని డిసైడ్ అయిందా అన్న కోణంలో ఆలోచిస్తే వైష్ణవి మరణం అశ్వితను బాగా కలచివేసినట్టు, బాధించినట్టు, ఆ బాధను తట్టుకోలేకనే అస్మిత ఆత్మహత్యకు పాల్పడిందనే విషయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అస్మిత ఆత్మహత్య కలకలం రేపింది. మొత్తానికి సూర్యాపేట గురుకుల పాఠశాలలో వారం వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడటం ఆయా కుటుంబాల్లో, పాఠశాల విద్యార్థుల్లో, బంధుమిత్రులలో విషాదఛాయలు నెలకొన్నాయి. అస్మిత మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి సొంత గ్రామం బురకచర్లకు తీసుకురానున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.