Tuesday , July 16 2024

మహిళలపై వేధింపులు అరికట్టడానికే షీ టీం లు

  • బస్టాప్ లు, షాపింగ్ మాల్స్, కళాశాలలు, రద్దీ ప్రాంతాలలో నిరంతర నిఘా
  • మహిళల్లో షీ టీం ల పట్ల అవగాహన పెంచడానికి జర్నలిస్టులూ సహకరించాలి
  • సూర్యాపేట షీ టీం ఎస్సై ప్రవీణ్ కుమార్

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి మార్చి 15 : మహిళలపై వేధింపులు అరికట్టడానికి షీ టీం పనిచేస్తుందని, వేధింపులకు గురవుతున్న మహిళలు నేరుగా షీ టీం 87126 86056 నెంబర్ కు నేరుగా మెసేజ్, వాట్సాప్ ద్వారా కూడా పంపవచ్చని సూర్యాపేట జిల్లా షీ టీం స్టేషన్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ చెప్పారు. షీ టీం ల గురించి మహిళల్లో అవగాహన పెంచడానికి షీ టీం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విలేకరులు నిత్యం ఫీల్డ్ లో ఉంటారని, ఎక్కడ సమస్య ఉన్న మొదటగా విలేకరులకే తెలుస్తుందని, విలేకరులు మహిళలకు జరుగుతున్న వేధింపుల విషయాల్లో సత్వరం తమకు సమాచారం అందిస్తే తగు చర్యలు చేపడతామని ఆయన వివరించారు. మహిళల్లో అవేర్నెస్ పెంచి చట్టం మహిళలకు ఏ విధంగా వర్తిస్తుందో అన్న విషయాలపై విస్తృతంగా షీ టీం ప్రచారం నిర్వహిస్తుందని చెప్పారు. ఇందుకు గాను జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలో షీ టీం సిబ్బంది కళాజాత సిబ్బంది సమావేశాలు నిర్వహించి మహిళలకు చట్టపరంగా ఉన్న హక్కులను తెలియజేస్తున్నామన్నారు. తమ సిబ్బంది నిత్యం సివిల్ డ్రెస్ లలో ఉండి పాఠశాల లు, కళాశాలలు, షాపింగ్ మాల్స్, ఇతర రద్దీ ప్రాంతాలలో నిఘా ఉంచి కెమెరాల ద్వారా సంఘటనలను చిత్రీకరించి, అందుకు బాధ్యులైన వారిని, వారి కుటుంబ సభ్యులను కూడా షీ టీం కార్యాలయానికి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఆయా వ్యక్తుల ప్రవర్తనలో మార్పులు తీసుకువస్తున్నామని చెప్పారు. వేధింపులకు గురవుతున్న మహిళలు సమాచారం అందిస్తే వారు ఉన్న ప్రాంతానికే వెళ్లి సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పారు. సూర్యాపేట జిల్లాలో విద్యాపరంగా మెడికల్ కళాశాల, ఇతర విద్యాసంస్థలు, విరివిగా ఏర్పాటు అవుతున్నాయని, ఆయా ప్రాంతాల్లో చదువుకునే అమ్మాయిల పట్ల ఆకతాయిలు న్యూసెన్స్ సృష్టిస్తూ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారని, అలాంటి ప్రాంతాల్లో రెగ్యులర్ గా నిఘా పెడుతున్నామని వెల్లడించారు. మహిళలు ఆరోగ్యపరంగా భద్రతాపరంగా స్వేచ్ఛాయుతంగా జీవించే వాతావరణము కల్పించడానికి తాము చట్టపరంగా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బయట చెపితే తమ పరువు పోతుందని అనేకమంది మహిళలు వేధింపులను తమలోనే దాచుకొని బాధపడుతున్నారని, బాధితుల పేరు బయటకు రాకుండా సమస్యలను షీ టీం ద్వారా చాకచక్యంగా పరిష్కరిస్తున్నామని, మహిళల భద్రత కోసమే షీ టీములు పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. జిల్లా వ్యాప్తంగా వేధింపులకు గురవుతున్న మహిళలు షీ టీం కు ఫిర్యాదు చేసి పరిష్కారం పొందవచ్చని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇంకా షీ టీం సిబ్బంది సురకంటి ఎల్లారెడ్డి, జాఫర్, శివరాం, సాయి జ్యోతి, పాల్గొన్నారు.