Monday , September 16 2024

పీఎం విశ్వకర్మ యోజనను సద్వినియోగం చేసుకోవాలి

గ్రామాలలో పథకంపై అవగాహన కల్పించాలి

ఆన్ లైన్ లో దరఖాస్తు విధానంపై ప్రజలను చైతన్యం చేయాలి

జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్. లత

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి మార్చి 04 : ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలో పీఎం విశ్వకర్మ యోజన పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా
మాట్లాడుతూ.. కులవృత్తుల వారిని గుర్తించి నైపుణ్యాలను అభివృద్ధి చేసి, వారికి ఆర్థికంగా చేయూతనిచ్చి జీవనోపాధిని పెంపొందించేందుకే ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. పథకంపై పట్టణ, మండలాల్లో స్వయం సహాయక బృందాలు, పట్టణాభివృద్ధి సంస్థ రిసోర్స్‌ పర్సన్స్‌ ద్వారా విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. సంప్రదాయ చేతి వృత్తుల వారు, హస్తకళాకారులను ప్రోత్సహించడంతో పాటు వారిని ఆర్థిక బలోపేతం చేసేందుకు అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ పథకంపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించే విధంగా సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలనే దానిపై ప్రతి గ్రామంలో ప్రజలను చైతన్యం చేయాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేసి, నైపుణ్యత కోసం ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ కాలంలో రూ.5వందల స్టైఫండ్‌తో పాటు ధృవీకరణ పత్రం, గుర్తింపు కార్డు ఇస్తామన్నారు. అలాగే వృత్తి పరికరాలు టూల్‌ కిట్టు కొనుగోలు కోసం రూ.15వేల ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ పథకంలో లబ్ధిదారులు కేవలం ఐదు శాతం వడ్డీతో రుణం పొందవచ్చన్నారు. విశ్వకర్మలు తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించే బాధ్యత ఎంఎస్‌ఎం భరోసా కల్పిస్తుందన్నారు.