Monday , September 16 2024

నాటి కేసిఆర్ ఉద్యమాన్ని తలపించేలా మరో పంచాయితీ..!!?

కేసీఆర్ కు దిమ్మతిరిగేలా… తగ్గేదే లే అంటున్న జూనియర్స్…

వెంక గారి భూమయ్య సీనియర్ జర్నలిస్ట్ వర్తమానం రాజకీయాలపై విశ్లేషణ

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడ్డ కొద్దీ సమస్యలతో రాష్ట్ర ముఖ్యమంత్రి కి దెబ్బ మీద దెబ్బ పడుతూనే వస్తుంది. కర్ణాటక ఎన్నికలు ముగించగానే తెలంగాణ ఎన్నికలకు హడావిడి మొదలవుతుందని, ఈ సమయంలో పంచాయితీ జూనియర్ కార్యదర్శులు చేస్తున్న సమ్మెను వజ్రాయుధంగా వాడుకొని ప్రతిపక్షాలు ఎక్కడ విమర్శలు ఉధృతం చేస్తారన్న భయం కెసిఆర్ కు తట్టిందట.. రాష్ట్రంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, వివో ఏలు, ఆర్టీజన్ లు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఇప్పటికీ వరకు నిరసనలు, సమ్మెలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ, ప్రతిపక్ష పార్టీలకు అవకాశం కల్పిస్తూ, కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి నిత్యం నిద్ర లేకుండా చేస్తుంది విషయం తెలిసిందే.

కోటి రతనాల వీణ… నా తెలంగాణ అనే మాట వింటూ….60 సంవత్సరాల నుండి తెలంగాణ కోసం ఎలా అయితే ఉద్యమాన్ని ఉధృతం చేశామో.. అదే తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా అదే తరహాలో ఉద్యామన్ని ఉధృతం చేస్తామని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు దీటుగా.. తగ్గేదే లే అంటూ… సమ్మెను ఉదృతం చేశారు.దీనిని జీర్ణించుకోలేని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది.విధుల్లో చేరకుంటే ఉద్యోగం నుండి తొలగిస్తామంటూ అల్టిమేట్ జారీచేసింది. దానికి ధీటుగానే పంచాయతీరాజ్ జూనియర్ కార్యదర్శులు సమ్మె విరమించేది లేదని, రోజుకొక తీరు నిరసనలతో ఉద్యమాలు చేపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలకు దారి తీస్తున్నారు. ఒక్కరిదేమో ఉద్యోగుల కోసం పోరాటం చేస్తుంటే …మరొకరిది పట్టు కోసం పాకులాట. . ఎవరు పట్టులో వారు తగ్గేది లే అంటూ.. కెసిఆర్ నేర్పిన ఉద్యమాలే చేస్తున్నామని, కచ్చితంగా తమకు ఉద్యోగ భద్రత, రెగ్యులరైజషన్ జీవో వచ్చేవరకు ఉద్యమాన్ని ఆపేది లేదు.. తెలంగాణ సర్కార్ తో హమీ,తుమి తేల్చుకుంటామని.. దేశంలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా 70 అవార్డులు తీసుకురావడంలో పంచాయతీ జూనియర్ కార్యదర్శుల కృషే కారణమంటూ, ఇంత చేస్తున్న ప్రభుత్వం మున్సిపాలిటీ కూలీల కంటే హీనంగా చూస్తుందని ఆవేదనతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఉన్నారని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 13360 పంచాయతి కార్యదర్శులు ఉండగా 9,000 కు పైగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్నారు. రెగ్యులర్ గా 3250 మంది కార్యదర్శులు పనిచేస్తుంటే ఔట్ సోర్సింగ్ కింద 800 కార్యదర్శులు పనిచేస్తున్నారు . వీరి కృషి ఫలితంతో దేశంలో ఉత్తమ తెలంగాణ గా గుర్తింపు తీసుకొచ్చారు. రాష్ట్రంలో మరింత పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం పంచాయితీ కార్యదర్శులను నియమించింది. మొదట మూడు ఏళ్ల కాలపరిమితిని విధిస్తూ పంచాయతీ కార్యదర్శులకు 15000 వేతనం చెల్లించింది. 2021 పి ఆర్ సి సందర్భంగా పంచాయతీ కార్యదర్శులకు వేతనాన్ని 15 వేల నుంచి 28,019 కి పెంచింది. కానీ జీవో 26 ద్వారా కార్యదర్శి ప్రొబేషనరీ పీరియడ్స్ నాలుగేళ్లు పొడిగించింది. అది కూడా ఈ ఏడాది ఏప్రిల్ 11 న ముగింసింది. ప్రభుత్వం జూనియర్ కార్యదర్శులను,అవుట్సోర్సింగ్ కార్యదర్శులను రెగ్యులర్ గా చేయాలని, ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చి సమ్మె 28 నుండి చేపడుతున్న జూనియర్ కార్యదర్శులను తెలంగాణ ప్రభుత్వం బెదిరింపులకు గురి చేస్తూ విధులలో చేరకుంటే ఉద్యోగాల నుండి తొలగించమని బెదిరింపులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఒడిదొడుకుల మధ్యనే పంచాయతీ పాలన సాగుతుంది. వారానికి పైగా పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించి బుజ్జగించడంలో పూర్తిగా విఫలమయిందని చెప్పుకోవచ్చు. సమస్యను మరింత జఠిలం చేస్తూ ప్రభుత్వం సమస్యను సృష్టిస్తుంది తప్ప పరిష్కరించే మార్గం వెతకడం లేదనే విమర్శలు లేకపోలేదు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, పల్లెలను పరిశుభ్రంగా చేస్తూ ఎన్నో ఉత్తమ అవార్డులు తీసుకొస్తున్న పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయడంలో ప్రభుత్వం ఎందుకు జంకుతుందని విమర్శ. కార్యదర్శుల సమ్మెకు కారకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనే విమర్శలు లేకపోలేదు. మూడు సంవత్సరాల కాలపరిమితి ముగించిన తర్వాత రెగ్యులర్ చేస్తానంటూ కార్యదర్శులకు ఇచ్చిన హామీ నిలబెట్టు కోకపోవడమే సమ్మెకు దారితీస్తుందని చెప్పొచ్చు. గతంలో సమ్మెబాట పట్టిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం సమ్మె చేసిన సందర్భంలో వారిని తొలగించి విధుల్లోకి తీసుకుందని, ఇప్పుడు కూడా అదే జరుగుతుందనే భావనలో పంచాయతీ కార్యదర్శులు కూడా ఉన్నారేమో..!! కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఓ పక్క కొలువుల కోసం మరోపక్క రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ తో రోజుకో ఉద్యోగులు, కార్మికులు సమ్మె బాట పడుతున్నారు. బంగారు తెలంగాణలో బాధలు తప్పక పాయె. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం జీవో 26 ప్రకారం ప్రొబేషన్ డిక్లేర్ చేసి బెనిఫిట్స్ ను కల్పించాలి. నిర్దిష్టమైన జాబ్ వర్క్ ప్రకటించి పని ఒత్తిడిని తగ్గించాలని ఖచ్చితమైన లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చేంత వరకు సమ్మె విరమించేది లేదంటూ జేపిఎస్ ఓపిఎస్ లు తగ్గేది లే అని తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసిరుతుందని చెప్పుకోవచ్చు. సవాల్ కు ప్రతి సవాల్ అంటూనే ఇటు ప్రభుత్వానికి అటు పంచాయతీ కార్యదర్శులకు నష్టం వాటిల్లక తప్పదేమో.. ఇప్పటికైనా ఇరుపక్షాలైన ప్రభుత్వం, పంచాయతీ కార్యదర్శులు ఓ నిర్ణయానికి వచ్చి సమస్య పరిష్కరించుకోవాలని మేధావులు, రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రభుత్వం దిగి వస్తుందో లేక జూనియర్ కార్యదర్శులు దిగి వస్తున్నారో.. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం.