దేశానికే దిక్సూచిగా, పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ పోలీస్ సేవలు
బ్లూ కోల్ట్, పెట్రో కార్స్ షీ టీమ్,సేవలతో మరింత పటిష్టంగా పోలీస్ వ్యవస్థ
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.
రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ కెరటం ప్రతినిధి జూన్:-04
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సురక్ష దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ శాఖ,17th బెటాలియన్ సంయుక్త ఆధ్వర్యంలో పెట్రో కార్,బ్లూ కోల్ట్ వివిధ విభాగాలకు చెందిన పోలీస్ వాహనాలు,పోలీస్ డాగ్స్,డిస్ట్రిక్ట్ గార్డ్ రోబోర్ట్ సిబ్బంది జిల్లాలోని పోలీస్ అధికారులు సిబ్బంది తో పోలీస్ పని తీరుతెలిసేలా సిరిసిల్ల పట్టణంలోని వాసవి గార్డెన్స్ నుండి పాత బస్టాండ్, అంబేద్కర్, గాంధీ మీదుగా వెళ్లి కొత్త బస్టాండ్ వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం వరకు నిర్వహించారు.పోలీస్ భారీ ర్యాలీకి గాంధీ చౌక్ వద్ద స్థానిక మహిళలు ఘణస్వాగతం పలికారు ఈ భారీ ర్యాలీలో ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్, సిరిసిల్ల మున్సిపల్ చైరపర్సన్ జింధం కళ తదితరులు పాల్గొన్నారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు దూరదృష్టి ప్రత్యేక చొరవతో పోలీస్ వ్యవస్థ పటిష్టం అయింది అని,రాష్ట్ర ఆవిర్భావం కంటే ముందు ఒక డీఎస్పీ స్థాయి అధికారి పరిధిలో ఉన్న సిరిసిల్ల, రాష్ట్రం సిద్ధించి జిల్లాగా ఏర్పడిన తర్వాత జిల్లాకు ఒక ఎస్పీ స్థాయి,ఒక అడిషనల్ ఎస్పీ, నలుగురు డీఎస్పీ స్థాయి అధికారులతో జిల్లాలో శాంతిభద్రతలను పర్యవేక్షించడంలో భాగస్వామ్యమై ప్రజలకు మరింత రక్షణగా ఉంటూ ఎన్నో రకాల సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం,జిల్లా ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో జిల్లా కేంద్రంలో సుమారు 38 కోట్ల 50 లక్షల రూపాయలతో పోలీస్ కార్యాలయ సముదాయ భవనాన్ని నిర్మించడం జరిగింది. త్వరలోనే ఈ కార్యాలయాన్ని ప్రారంభించి, అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.జిల్లా ఏర్పడిన తర్వాత కొత్తగా ఒక పోలీస్ సబ్ డివిజన్
(వేములవాడ),రెండు సర్కిల్ (ఎల్లారెడ్డిపేట చందుర్తి)నాలుగు పోలీస్ స్టేషన్లు (తంగళ్ళపల్లి, వీర్నపల్లి, రుద్రంగి,వేములవాడ రూరల్)ప్రజలకు అందుబాటులోకి రాగా కొత్తగా మరో రెండు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయని ఎస్పీ అన్నారు.
మహిళల భద్రతకు షీ టీమ్స్
మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని రెండు పోలీస్ డివిజన్లలో SI స్థాయి అధికారి నేతృత్వంలో రెండు షీ టీమ్స్ ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణతో మహిళలపై వేధింపులను పూర్తిగా అరికట్టడం జరిగిందని తెలిపారు. షీ టీమ్ మహిళలు పనిచేసే ప్రదేశాలలో, విద్యాలయాలలో, బస్ స్టేషన్ లలో, లైంగిక దాడులు అరికట్టడంలో సఫలీకృతం అయిందని, అదేవిధముగా జిల్లాలో ప్రతిరోజూ ఒక గ్రామంలో,విద్యాలయాలలో ప్రజలకు, విద్యార్థినీ, విద్యార్థులకు షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మహిళల రక్షణ విషయంలోనే కాక మహిళలకు ఉద్యోగ కల్పన విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి, మహిళలకు పోలీసు ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ కల్పించి రాష్ట్రంలో మహిళా పోలీస్ అధికారుల సిబ్బంది యొక్క సంఖ్యను పెంచడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా జిల్లాలో (19) మంది మహిళా పోలీస్ ఉద్యోగులు పనిచేస్తున్నారని వివరించారు. జిల్లాలో మహిళల భద్రత, ప్రయాణికుల సమస్యలను పరిష్కరించడానికి “అభయ” మై టాక్సీ సేఫ్ అనే యాప్ అందుబాటులోకి తీసుకువచ్చి జిల్లాలోని మూడు వేల ప్యాసింజర్ వాహనాలకు ఈ యాప్ ను అనుసంధానం చేయడం జరిగిందని తెలిపారు.
బ్లూ కోల్ట్, పెట్రో కార్,డయల్100
గతంలో పట్టణానికి మాత్రమే పరిమితమైన బ్లూ కోల్ట్ మరియు పెట్రో కారు సేవలను జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరింపజేస్తూ జిల్లాలో ప్రస్తుతం 13 పెట్రో కార్లు మరియు 15 బ్లూ కోల్ట్ బృందాలు ప్రజారక్షణకై అహర్నిశలు పనిచేస్తున్నాయని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న బ్లూ కోల్ట్ మరియు పెట్రో కార్ వాహనాలు రోజుకు సుమారు 50 కిలోమీటర్ల దూరం ప్రజాసేవకై ప్రయాణిస్తున్నాయని అన్నారు. డయల్ 100 ద్వారా జిల్లాలో ఏ ప్రాంతంలోనైనా నేర సమాచారం అందించిన అయిదు నిమిషాల్లో పోలీస్ బృందాలు బ్లూ కోల్ట్ మరియు పెట్రో కారు ద్వారా చేరుకొని క్షేత్ర స్థాయిలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకు రక్షణ కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.
నేరాల నియంత్రణలో కీలకంగా సీసీ కెమెరాలు
జిల్లాలో నేరాలు అరికట్టడములో సీసీ కెమెరాల పాత్ర ముఖ్యమని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఒక వేయి 130 సీసీ కెమెరాలను రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు క్రింద రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎంచుకొని టి ఫైబర్ ద్వారా జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయడం జరిగిందని ఎస్పీ అన్నారు. దీని ద్వారా గ్రామాలు, పట్టణాల్లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ సమస్య తలెత్తిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించి శాంతి భద్రతలు పరిరక్షించడానికి వీలు కలుగుతుందని తెలిపారు.
పాస్ పోర్ట్ ఎంక్వయిరీ సులభతరం
సిరిసిల్ల జిల్లాలో ప్రతి నెల సుమారు 800 పాస్ పోర్ట్స్ గురించి ధరఖాస్తు చేసుకోవడం జరుగుతుందని, పాస్ పోర్ట్ ఎంక్వయిరీ లో తెలంగాణ రాష్ట్రం దేశములోనే మొదటి స్థానములో ఉన్నదని, రాష్ట్ర అవతరణ అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే (7) లైసెన్స్ ఏజెన్సీలు ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్ళే వారికోసం అందుబాటులోకి వచ్చాయని ఆయన తెలిపారు.
ముఖ్యంగా ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లడానికి పాస్ పోర్ట్ గురించి గతంలో నెలల పాటు తిరగవలసి రాగా రాష్ట్ర అవతరణ తర్వాత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విచారణలు పూర్తిచేసి వారం రోజుల్లోనే పాస్ పోర్ట్ అందించడం జరుగుతుందని, ప్రతిష్టాత్మకంగా జిల్లాలో పాస్ పోర్ట్ కు సంబంధించి అన్ని రకాల వెరిఫికేషన్లు మూడు(3) రోజుల్లోనే పూర్తి చేస్తున్నామని అన్నారు.
నేరాల నియంత్రణకు ప్రథమ ప్రాధాన్యత
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జిల్లాలో ఒక సీసీఎస్ పోలీస్ స్టేషన్, ఒక సైబర్ సెల్, ఒక యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అందుబాటులోకి వచ్చాయని, వీటి ద్వారా అనేక సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా మరియు దొంగతనాలు ఆసాంఘిక శక్తుల చట్టవ్యతిరేక కార్యకలాపాలను సమర్థవంతంగా అరికడుతున్నాయని ఎస్పీ వివరించారు. కోర్టులో జరుగుతున్న కేసులను విచారణ పర్యవేక్షణ నిమిత్తం కోర్ట్ మానిటరింగ్ సిస్టం లో భాగంగా ఎస్సై స్థాయి అధికారిని నియమించి ప్రత్యేక పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా ఆవిర్భావం నుండి 85 కేసులలో నేరస్తులకు శిక్షలు విధించగా అందులో ముఖ్యంగా నాలుగు కేసులలో ముద్ధాయిలకు జీవిత ఖైధు,ఒక కేసులో 10 సంవత్సరాల శిక్ష, రెండు కేసులలో అయిదు సంవత్సరాల జైలు శిక్ష విధించబడిందని అంతే కాకుండా రెండు కేసులల్లో ముగ్గురు వ్యక్తులపై పిడి ఆక్ట్ క్రింద కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తగిన చర్యలు:
మన జిల్లాలో ముఖ్యంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి దేశ నలుమూలల నుండి నిత్యం భక్తులు వస్తుంటారని, అలాగే ఇతర రవాణా మార్గాల్లో ప్రమాదకరంగా ఉన్న చోట రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసు వారు వివిధ శాఖల సమన్వయముతో రోడ్డు ప్రమాదాలు నియంత్రించడానికి పలు రకాల చర్యలు చేపడుతున్నామని వివరించారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులోకి తీసుకవచ్చి ట్రాఫిక్ విభాగంతో పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
సాంకేతికత అభివృద్ధితో పారదర్శకమైన సేవలు
రాష్ట్ర అవతరణ తరువాత సాంకేతికత అభివృద్ధితో ప్రజలకు పారదర్శకమైన సేవలు అందిస్తున్నామని ఎస్పీ అన్నారు. ప్రతిష్టాత్మకంగా సిసిటిఎన్ఎస్,టీఎస్ కాప్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ హెచ్.ఆర్.ఎం.ఎస్ మీసేవ సర్వీస్, సి డాట్ మరియు షీ టీమ్స్ ఫంక్షనల్ వర్టికల్స్ తో పాటు మొత్తం (28) అప్లికేషన్లను పోలీస్ విభాగాల్లో ప్రవేశపెట్టి ప్రజలకు అత్యున్నతమైన సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.
కమ్యూనిటీ పోలీసింగ్ తో ప్రజలతో మమేకం
ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా, ప్రజలకు పోలీస్ శాఖ ద్వారా పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా “ఠాణా దివస్”,మొబైల్ ఠాణా,మెసేజ్ యువర్ ఎస్పీ అనే విన్నూత కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు మరింత చేరువకావడంతో పాటుగా వారి సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కారం చూపేలా చర్యలు చేపడుతూ, జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత ఉద్యోగ శిక్షణ శిబిరాలు, జాబ్ మేళాలు, స్పోర్ట్స్ మీట్,స్పోర్ట్స్ కిట్స్ అందజేయడం జరిగిందని ఎస్పీ అన్నారు.
అధికారులు, సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు
పోలీస్ ఉద్యోగం అంటేనే 24/7 ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం అని, జిల్లాలో పని చేస్తున్న అధికారులు,సిబ్బంది, హోం గార్డ్స్ యొక్క ఆరోగ్య సంక్షేమం దృష్ట్యా వారికి యోగా క్లాస్ లు,పరేడ్,హెల్త్ క్యాంప్ లు, స్పోర్ట్స్ మీట్ లు నిర్వహిస్తూ వారిలో నూతనోత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపడం జరిగుతుందని అన్నారు. జిలాల్లోని 200 హోం గార్డులకు రాయితీతో కూడిన హెల్త్ కార్డ్స్ అందజేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,17th బెటాలియన్ కమాండెంట్ శ్రీ కె.సుబ్రమణ్యం,డిఎస్పీ లు నాగేంద్రచరి, రవికుమార్, సి.ఐ లు,ఎస్.ఐ లు 1th బెటాలియన్ అధికారులు, పోలీస్ సిబ్బందిపాల్గొన్నారు..