Monday , September 16 2024

తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలి,

ప్రతి మున్సిపాలిటీ,
కార్పొరేషన్లలో చేపట్టిన అభివృద్ధిని తెలియజేయాలి,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్,

తెలంగాణ కెరటం జూన్ 15 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో ఈనెల 16న తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని ఈ విషయంలో ప్రజలకు నాటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు తెలియజేసేలా కరపత్రాలు, ఫెక్సీల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులకు సూచించినారు . ఈనెల 16న నిర్వహించనున్న తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సాన్ని నిర్వహించాల్సిన విషయమై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆరోజున ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేయాలన్నారు. అనంతరం పట్టణ ప్రగతి ద్వారా, పట్టణానికి వచ్చిన నిధుల వివరాలను, వాటితో వివిధ సంక్షేమ పథకాల ద్వారా పట్టణ ప్రజలకు జరిగిన లబ్దిని, పట్టణంలో నిర్మించిన మౌలిక వసతుల వివరాలను తెలియజేయాల్సిందిగా కలెక్టర్ సూచించారు. పట్టణ పారిశుద్ధ్యం, పచ్చదనం గణనీయంగా మెరుగుపడిన తీరును ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా వివరంచడంతో పాటు కరపత్రాలు, ఫ్లెక్సీల ద్వారా తెలియజేసి వివరించాల్సిన బాధ్యత సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జాతీయ స్థాయిలో, జిల్లా స్థాయిలో పట్టణాభివృద్ధిలో తాము సాధించిన ఆవార్డుల వివరాలను తెలియజేయాల్సిందిగా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని ఆయా పట్టణాల్లో నిర్మించిన సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల గురించి, వైకుంఠధామాల నిర్మాణం, డంప్ యార్డులు, అర్బన్ ఫారెస్ట్, పార్కుల నిర్మాణం, పది శాతం శాతం.. గ్రీన్ బడ్జెట్గా కేటాయించడం తదితర అభివృద్ధి అంశాల గురించి ప్రస్తావించాలని కలెక్టర్ అమోయ్ కుమార్ వివరించారు. అలాగే నాడు -– నేడు ఫార్మాట్ లో పట్టణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని, ప్రజా సంక్షేమానికి,పురపాలక శాఖ ద్వారా వస్తున్న నిధుల వివరాలతో పట్టణాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఫొటోలతో బ్రోచర్ల మాదిరిగా తయారుచేసి పంపిణీ చేయాలన్నారు. అలాగే జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి ఎద్దడిని పరిష్కరించిన తీరు. ఉచితంగా తాగునీటి సరఫరా వివరాలను తెలియజేయాలన్నారు. దేశానికే దిక్సూచీగా టీఎస్ బీ– పాస్ చట్టం తీసుకువచ్చిన విషయాలు… దీని ద్వారా సులువైన నిర్మాణ అనుమతుల ప్రక్రియ వంటి అంశాలను తెలియ చేయాలని కలెక్టర్ అమోయ్ కుమార్ పేర్కొన్నారు. దీంతో పాటు జీవో 58, 59 తదితర జీవోల ద్వారా పేద ప్రజలు నిర్మించుకున్న ఇండ్లకు పట్టాలు అందజేసిన విధానం గురించి ప్రముఖంగా ప్రస్తావించాలన్నారు. అనంతరం ఉత్తమ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వార్డు కౌన్సిలర్లకు, ఛైర్మన్లకు, మేయర్లకు, ఉద్యోగులకు సన్మానం చేయాలని కలెక్టర్ అమోయ్ కుమార్ వివరించారు.