Saturday , October 12 2024

నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి

రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు

తెలంగాణ కెరటం గజ్వేల్ నియోజకవర్గం: 03మార్చి 2023

మీకు ఇచ్చిన మాట ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తి చేసి సర్వ హక్కులు మీకు కల్పించి ధృవీకరణ పత్రాలు అందిస్తున్నాం. మీ ప్రాంతంలో పెద్ద పెద్ద పరిశ్రమలు రానున్న దృష్ట్యా దయచేసి ప్లాట్లు విక్రయించొద్దని నిర్వాసితులను రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు.పెద్ద పరిశ్రమలు ద్వారా నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగాలు రావాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మహతి ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం 430 టీఎస్ఐఐసీ భూ నిర్వాసితులకు, 59 జీఓ కింద 39 మంది లబ్ధిదారులకు నివేశన స్థల పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వర్గల్ లోని టీఎస్ఐఐసీ భూ నిర్వాసితులు ఏ ఒక్కరూ మిగలకుండా అందరికీ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. మానవతా దృక్పథంతో నిర్వాసితులు అందరికీ సాయం అందించాలని ఆర్డీఓ విజయేందర్ రెడ్డిని మంత్రి ఆదేశించారు. మరో 3, 4 ఏళ్లలో మీ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. వర్గల్ ప్రాంతంలో కోకాకోలా, అమూల్ డైరీ, మస్కటీ డైరీ, సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, అతిపెద్ద రైస్ మిల్లులు రానున్నాయని, దీంతో చాలామంది ఉద్యోగ, ఉపాధి పొందవచ్చునని వివరించారు. కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నిర్వాసిత కుటుంబాలను గుర్తించాలని, వారికి ప్రత్యేకంగా శిక్షణ తరగతులు ఇచ్చి ఉపాధి, ఉద్యోగం పొందేలా చూడాలని జిల్లా కలెక్టర్ కు మంత్రి సూచించారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *