తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి మే 13:
ఎన్నికల సామాగ్రి తో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి భద్రతా దళాలతో పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లిన ఎన్నికల సిబ్బంది.
తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నేడు నారాయణపేట జిల్లాలో జరిగే పోలింగ్ ప్రక్రియకు కట్టుదిట్టంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని శ్రీ దత్త బృందావన్ బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షించారు.
జిల్లాలోని నారాయణపేట నియోజకవర్గంలో 270, మక్తల్ నియోజకవర్గంలో 284 పోలింగ్ కేంద్రాల్లో నేటి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించే విధంగా పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నారాయణపేట నియోజకవర్గం లోని 270 పోలింగ్ స్టేషన్ లకు 31 రూట్ లు 31 కౌంటర్ లు ఏర్పాటు చేసి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా అన్ని మెటీరియల్, ఈవిఎం లను తీసుకొని భద్రతా దళాల కట్టుదిట్టమైన భద్రతా మధ్య రూట్ ల వారీగా పంపించడం జరిగిందన్నారు. అలాగే మక్తల్ జూనియర్ కళాశాల మైదానంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మక్తల్ లో మీడియాతో మాట్లాడుతూ… నియోజకవర్గానికి సంబంధించిన 284 పోలింగ్ కేంద్రాలకు 35 రూట్ లు, 35 కౌంటర్లను ఏర్పాటు చేసి అన్ని మెటీరియల్, ఈవిఎం లను తీసుకొని భద్రతా దళాల కట్టుదిట్టమైన భద్రతా మధ్య రూట్ ల వారీగా పంపించడం జరిగిందని తెలిపారు. నారాయణపేట, మక్తల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో సిబ్బందికి అన్ని సదుపాయాలు కల్పించామని, త్రాగునీరు, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు, ఇతర వస్తువులు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఎన్నికల సామగ్రి పంపిణీ అనంతరం కలెక్టర్ ఎన్నికల నిబంధనలు తూచ తప్పకుండా పాటిస్తూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూ ఎన్నికల సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకొని అక్కడ రేపటి ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉదయాన్నే 5.30 గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభించి అన్ని క్లియర్ చేసిన అనంతరం ఉదయం 7 గంటలకు పోలింగ్ ను ప్రశాంతంగా ప్రారంభించి పారదర్శకంగా ముగించాలని సూచించారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో చలువ నీడ తో సహా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.జిల్లా లో అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశామని, కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వెబ్ క్యాస్టింగ్ ద్వారా నియోజకవర్గం వారీగా పోలింగ్ సరళిని పరిశీలిస్తూ ఎప్పటికైప్పుడు తగు ఆదేశాలు ఇస్తామని కలెక్టర్ తెలిపారు.
నేటి ఎన్నికల పోలింగ్ లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిష్పక్షపాతంగా, ధైర్యంగా ఓటు వేయాలని ఆయన జిల్లా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్, రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, అసిస్టెంట్ ట్రైని కలెక్టర్ గరీమా నరుల, ఆర్డీవో మధుమోహన్, తహసిల్దార్లు రాణా ప్రతాప్, సువర్ణ రాజు, కలెక్టరేట్ ఏవో నర్సింగ్ రావు, కలెక్టరేట్ సిబ్బంది, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.