Saturday , October 12 2024

పదేండ్ల తర్వాత పేదోళ్ల కండ్లలో ఆనందం చూస్తున్నం

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణ కెరటం:బ్యూరో నల్గొండ మార్చ్ 3 /2024

నల్గొండ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల పోస్టర్ ను విడుదల చేసిన కోమటిరెడ్డి

పీహెచ్ సీలో పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్న రోడ్లు భవనాలశాఖామాత్యులు
గృహజ్యోతి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమాన్ని వివరించిన కోమటిరెడ్డి
నల్గొండ జిల్లాలో గృహ జ్యోతి లబ్ధిదారులు 1 లక్ష 82 వేలు
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలను 90 రోజుల్లోనే అమలు చేస్తున్నాం
మార్చి 11 నుండి ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వనున్నాం -రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
బైక్ పై నల్గొండ పట్టణంలో వివిధ కార్యక్రమాలకు అటెండ్ అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మంత్రి కోమటిరెడ్డి నల్గొండ పర్యటనతో కాంగ్రెస్ క్యాడర్ లో జోష్ కాంగ్రెస్ గృహజ్యోతి ఫేమస్ – కేసిఆర్ 24 గంటల కరెంట్ బోగస్” అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఇవ్వాల నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి నల్గొండ పట్టణం, తిప్పర్తి, కనగల్ మండలాల్లో ఉచిత విద్యుత్ వినియోగదారులతో ముఖాముఖి నిర్వహించారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇంటిని నిర్మించి పేదలకు పంచలేదని, ఒక్క రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. కానీ మేం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 4 గ్యారెంటీలను అమలు చేస్తున్నాం, మరో వారంలో ఐదో గ్యారెంటీ అమలు చేయబోతున్నాం. ఇప్పటికే 25 వేలమంది నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చాం. గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చాం, మెగా డీఎస్సీ ఇచ్చాం. 200 లోపు యూనిట్లు వాడుకునే పేదలందరికి జీరో బిల్లులు ఇచ్చి మా పరిపాలన సమర్ధతను నిరూపించుకున్నామని మంత్రి చెప్పారు. అంతేకాదు.. రాబోయే రెండేండ్లలో ఎస్ఎల్బీసీని పూర్తి చేసి నల్గొండ జిల్లాకు త్రాగు, సాగునీటి కష్టాలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.
అంతకు ముందు నల్గొండ పట్టణంలోని మాన్యం చెల్క, హైదర్ ఖాన్ గూడా, రహమత్ నగర్ లో జీరో విద్యుత్తు బిల్లుల వినియోగదారుల ఇంటికి వెళ్లిన మంత్రి.. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి రాకతో ఆనందం వ్యక్తంచేసిన లబ్ధిదారులు గత ప్రభుత్వంలో తాము ఎదుర్కొన్న కష్టాలను ఏకరువుపెట్టారు. గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్తు, బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు మహిళల కష్టాలను తీర్చుతున్నాయని తమ ఆనందాన్ని మంత్రితో పంచుకున్నారు.
గృహజ్యోతి లబ్దిదారులైన వి. కోటమ్మ, షబానాలను.. ఇంతకు ముందు కరెంటు బిల్లు ఎంత వచ్చేదని మంత్రి కోమటిరెడ్డి అడగగా.. గతంలో తాము రూ. 700 నుంచి రూ. 1000 రూపాయల దాక కరెంటు బిల్లులు చెల్లించేవారమని ఇప్పుడు ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేకపోవడం సంతోషం కలిగిస్తుందని మంత్రికి వివరించారు. అంతేకాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలు మహిళల కష్టాలను తీర్చుతున్నాయని వారు హర్షం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటో ప్రత్యక్షంగా చూస్తున్నామని లబ్ధిదారులు తమ సంబరాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తెలియజేశారు.అనంతరం తిప్పర్తి, కనగల్ లో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1 నుండి అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం కింద జీరో విద్యుత్ బిల్లులు రావడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని 90 రోజుల్లోనే అమలు చేస్తున్నామని తెలిపారు. ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు వాడుకుంటున్న అర్హులైన పేద వారికి విద్యుత్ బిల్లుల మాఫీ చేశామని, 500 రూపాయలకు ఎల్పీజీ సిలిండర్ వంటివి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
మార్చి 11 నుండి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని యుద్ధప్రతిపాదికన చేపట్టనున్నామని ఆయన తెలిపారు. సొంత స్థలం ఉన్న అర్హులకు 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాం. ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వమే మామిళ్ళ గూడెంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గానికి మూడు నుంచి ఐదువేల ఇండ్లను నిర్మిస్తామని చెప్పారు. వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని మంత్రి తెలిపారు.
కనగల్ లో జరిగిన సమావేశంలో.. మీరు పండగలకు, పెండ్లిళ్లకు పోయినప్పుడు బస్సుల్లో టికెట్ తీసుకుంటున్నారా అని మహిళల్ని అడగగా… లేదని వారు బదులిచ్చారు. రాష్ట్రంలో మహిళలంతా ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని, ఉచిత విద్యుత్తు ద్వారా ఇంటి ఖర్చుల భారాన్ని తగ్గించామని, రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా వంటింటి కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం పంచుకుంటుందని మంత్రి తెలిపారు. 3 నెలల్లో మాన్యం చెల్కలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు కొత్త భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నామని,ఇవేకాదు, రాబోయే రోజుల్లో ప్రతీ ఇంటికి సంక్షేమాన్ని చేర్చుతామని తేల్చిచెప్పారు. ప్రతిపక్షాలకు ఇవేవి మింగుడు పడటం లేదని.. లేనిపోని ఆరోపణలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ అందించే ఉచిత విద్యుత్తు వెలుగుల్లోని ఆత్మీయతను ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ తల్లి సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తుందని ఆయన తేల్చిచెప్పారు. రాబోయే ఇరవై యేండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని అన్నారు.
అంతకు ముందు నల్గొండలోని ఆర్య సమాజ్ ఆవరణలో నల్గొండ జిల్లా ఆర్య సమాజ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంత్రిని సమాజ్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.