తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 15):
సోమవారం నాగర్ కర్నూల్ జిల్లాలో నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల కలెక్టర్లు ఉదయ్ కుమార్, తేజస్ నందలాల్ పవర్, అదనపు కలెక్టర్లు కుమార్ దీపక్, సంచిత్ గంగ్వార్, మిషన్ భగీరథ ఉన్నతాధికారులతో కలిసి సందీప్ కుమార్ సుల్తానియా రిజర్వాయర్లో నీటిలభ్యతను పరిశీలించారు.కృష్ణానది శ్రీశైలం బ్యాక్ వాటర్ కోతిగుండం వద్ద నీటి నిలువలను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించి నీటి లభ్యత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవి లో జిల్లా ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రణాళికాబద్ధంగా నీటిని ఎత్తిపోతలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి సరఫరా అంశం అత్యంత కీలకమైనదని, దీనిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యతనిస్తూ అనునిత్యం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ నాగర్ కర్నూలు జిల్లాలో త్రాగునీటి ఎద్దడి నివారించేందుకు తీసుకున్న చర్యలను ఆయనకు వివరించారు.ఆయన వెంట మిషన్ భగీరథ అధికారులు తదితరులు ఉన్నారు.