- హద్దులు పెడుతుంటే వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు
- అధికారులు పోలీసులు రక్షణ కల్పించాలంటున్న బాధితుడు పెండం కృష్ణ
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 18 : మండల పరిధిలోని గాంధీ నగర్ లో గల సర్వేనెంబర్ 294లో 9 ఎకరాల భూమికి నేను హక్కుదారుగా ఉన్నానని ఆ భూమి నాదే అని బాధితుడు పేండం కృష్ణ అన్నారు. ఆదివారం సదరు భూమిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సర్వేనెంబర్ 294లో నాకు మొత్తం 25 ఎకరాల భూమి ఉండగా రెండు ఎకరాలు డబుల్ బెడ్ రూమ్ కు ఇచ్చానని ఒక ఎకరం రోడ్డుకు తీయగా 22 ఎకరాలు మిగిలిందన్నారు. ఈ 22 ఎకరాల భూమిని 2019లో పట్టణానికి చెందిన గాలి సుదీర్, సిరికొండ వెంకటరమణ లకు విక్రయించగా వారు కొన్ని డబ్బులు మాత్రమే చెల్లించగా సదరు భూమిలో 13 ఎకరాలు వారికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు. వారు ఆ భూమిని వేరొకరికి విక్రయించగా కొనుగోలు చేసిన వారు ఇప్పుడు మొత్తం భూమి తమదే అంటూ దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను కేవలం 13 ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని అందుకు సంబంధించిన అన్ని పత్రాలు నా వద్ద ఉన్నాయని ఈ 9 ఎకరాల భూమికి నేనే హక్కుదారున్ని అని అన్నారు. తన భూమికి హద్దులు ఏర్పాటు చేసుకునేందుకు భూమి చుట్టూ కడీలు పాతుతుండగా వచ్చి దౌర్జన్యం చేయడం సరికాదని ఈ విషయమై అధికారులు పోలీసులు తగిన విచారణ చేసి న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.