Wednesday , July 24 2024

ముదిరాజుల గమనం ఎటువైపు…?

                డా.పోలం సైదులు ముదిరాజ్,
                            M.A.,B.Ed.,Ph.D.,
                             9441930361.

   తెలంగాణరాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వివిధ ప్రదేశాలలో తలపెట్టిన పార్టీ బహిరంగ సమావేశాలలో మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో 9.91శాతం జనాభా కలిగిన షెడ్యూల్డ్ తెగల కులాలకు రిజర్వేషన్స్ 6 నుండి 10 శాతం పెంచుతామని,అలాగే14.46 శాతం జనాభా కలిగిన మైనారిటీలకు 4 నుండి 12 శాతం రిజర్వేషన్ పెంచుతామని హామీలనివ్వడం జరిగింది.15.45 శాతం జనాభా కలిగిన ఎస్సీ కులాలకు 15శాతం రిజర్వేషన్స్ లభిస్తున్నప్పటికీ అందులోని చాలా ఉపకులాలకు రిజర్వేషన్స్ విషయంలో అన్యాయం జరుగుతుందని,అందుకే వర్గీకరణ చేపట్టాలని కేంద్రప్రభుత్వంతో జరుగుతున్న రాజకీయపరిణామాలు తెలియనివికావు.అలాగే కేంద్రప్రభుత్వం 10శాతం జనాభా కలిగిన ఉన్నతకులాలలోని వెనుకబడినవారికి ఈ డబ్ల్యూ ఎస్ పేరుతో 10శాతం రిజర్వేషన్స్ కల్పిస్తే,రాష్ట్రప్రభుత్వం సైతం అమలుపరుస్తుంది.రాష్ట్రంలో చివరి అసెంబ్లీసమావేశాలలో మంత్రివర్యులు కల్వకుంట్ల తారకరామారావు మాట్లాడుతూ బీసీ-ఏ లోని అత్యంత వెనుకబడిన వాల్మీకిబోయ,బేధార్, కిరాతక,పెద్ద బోయ,నిశాది,చుండువాళ్ళు,తలయారి,కైతి లంబాడా,మధుర,చమర్,మాలి లాంటి 11కులాలను ఎస్టీ జాబితాలలోకి మార్చాలని తీర్మానంచేసి కేంద్రప్రభుత్వానికి నివేదిక పంపామని అసెంబ్లీసాక్షిగా చెప్పడం అందరికీ తెలిసిందే.దీనినిబట్టిచూస్తే ఓటుబ్యాంకు రాజకీయాలలో కులాల రిజర్వేషన్స్ అంశాన్ని ఎలా తెరపైకి తెస్తున్నారో అర్థంగాకమానదు.

    తెలంగాణ నూతనరాష్ట్రం ఏర్పడ్డాక సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శాసనసభసాక్షిగా రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినది ముదిరాజ్ కులమని,అలాగే ముదిరాజు అమ్మపాలు తాగాను,ఈ కులానికి మేలుచేసి అమ్మరుణం తీర్చుకుంటానని ప్రకటించడం అందరికీ తెలిసిందే.కానీ దాదాపు రాష్ట్రజనాభాలో 14.02 శాతంతో దాదాపు 55లక్షల జనాభా కలిగిన ముదిరాజులను కేవలం ఓటుబ్యాంకుగా ఉపయోగించుకున్నారే తప్ప,జరగాల్సిన న్యాయం జరగలేదని చెప్పడంలో ఎలాంటి అనుమానం అక్కరలేదు.ఎందుకంటే 119 శాసనసభ సభ్యులలో ఒకరు ఈటల రాజేందర్ గారు(ఆయనపై కక్ష్యగట్టినతీరు అందరికీ తెలిసిందే) అలాగే 40మంది కలిగిన శాసనమండలి సభ్యులలో బండ ప్రకాష్ గారు మరొకరు.(అదికూడా రాజ్యసభ నుండి దింపి ఆ పోస్టులో కల్వకుంట్ల కవితగారిని అక్కడికిపంపి ఇక్కడ ఇచ్చారు) ఒకవేళ వాస్తవంగానే ముద్దిరాజులపై ప్రేమతో ఇచ్చారనుకుంటే ఆ స్థానాన్ని అలాగే ఉంచి,ఇక్కడ ఇంకొక ముదిరాజు సామాజికవర్గానికి చెందినవ్యక్తికి ఇవ్వవచ్చు కదా ? ఇంకెవరు కనబడలేదా ?అధికారపార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులకే ఇవ్వాలనుకుంటే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక బాధ్యతలు వహించిన ముదిరాజులు లేరా ? లేదా సీనియర్ మేధావివర్గం గుర్తుకురాలేదా ? అంటే ఇక్కడ కక్ష్యపూరితంగానే ఈ సామాజికవర్గంపై వ్యవహరిస్తున్నతీరు యావత్తు ముదిరాజ్ వర్గం గమనిస్తుండడం
119 శాసనసభ్యులు కలిగిన శాసనసభలలో 16 నుండి 20 మందిసభ్యులు,40మంది కలిగిన శాసనమండలీలో 6మంది సభ్యులు,పార్లమెంటు (లోకసభ మరియు రాజ్యసభ)లో 10 నుండి 12మంది సభ్యులు,హైదరాబాద్ మినహా 32 జిల్లాపరిషత్తు చైర్మన్ లలో కనీసం 4గురు,594 మండలపరిషత్తు చైర్మన్ స్థానాలలో 83మంది ఇలా జడ్పిటిసి,ఎంపిటిసి,సర్పంచ్ స్థానాలలో జనాభా ప్రాతిపదికనా ముదిరాజులకు రావాల్సినపదవులు వారిసంఖ్యను చూస్తే ముదిరాజులకు ఎంత అన్యాయం జరుగుతుందో అర్థమవుతుంది.
    ముదిరాజులు విద్యా,ఉద్యోగ,ఆర్థిక,సామాజిక,రాజకీయంగా వెనుకబడడానికి అగ్రకులాలు ఒకకారణమైతే,ఐక్యతలేమి మరియు పటిష్టమైన నాయకత్వలేమి అనేవి స్పష్టంగా కనిపిస్తున్నాయి.రాష్ట్రంలో రాజకీయపార్టీల కారణంగా పార్టీలకనుగుణంగా పదులసంఖ్యలో సంఘాలు ఏర్పడి,పార్టీ అధిష్టాన సలహా,సూచనలమేరకు పనిచేస్తూ,రాజకీయపార్టీల వలే సంఘాలమధ్య అంతరుధ్యం ఏర్పడడంతో ముదిరాజ్ ప్రజానికంలో విశ్వసనీయతకోల్పోయి యావత్ జాతి వెనుకబాటుతనానికి కారకులవుతున్నారని చెప్పడంలో నిజంలేకపోలేదు. ముదిరాజులందరూ ఏకమైతే “అసలుకే ఎసరు వస్తుందని” భావించిన రాజకీయపార్టీలుసైతం ఆ సామాజికవర్గంపై “విభజించు – పాలించు” అనే ధోరణితో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది.
      ఏ కులంలోనైనా సంఘాలనేవి రాజకీయపార్టీలకతీతంగా ఉంటూ,ఆ సామాజికవర్గానికి దక్కాల్సిన హక్కులను పొందటానికి విభిన్న కార్యక్రమాలుచేస్తూ ఆకులంలో ఎక్కడ ఏ సమస్యవచ్చినా వెంటనే బాధితులకు మేమున్నామని భరోసానిస్తూ,సమస్యను పరిష్కరిస్తూ,రాజకీయనాయకులను తయారుచేసే ఉత్పాదితకేంద్రాలుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది.రాజ్యాంగబద్ధంగా,జనాభాప్రాతిపదికన ఆయా సామాజికవర్గ నాయకులను రాజకీయపదవులను అధిరోహించడానికి కృషిచేయాల్సిన అవసరం ఉంటుంది.ఒకవేళ సంఘంలోని సభ్యులకే రాజకీయవకాశాలు వచ్చి పదవులు వరించినప్పుడు సంఘబాధ్యతలను మరొకరికి అప్పగించి,అంతర్గతంగా తన సామాజికవర్గానికి మేలుకోరుతూ ప్రజలందరినీ సమానదృష్టిలో చూస్తూ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.అలాగే కులసంఘనాయకుడు తనకులంలో రాజకీయాలంటే ఆసక్తికలిగే తమసభ్యులకు శిక్షణలుగావించి రాజకీయపార్టీలపై ఒత్తిడితెచ్చి తమవారికి అవకాశాలు కల్పించి అవకాశాలున్నచోట పార్టీలకతీతంగా తమవారిని గెలిపించి,చట్టసభలలోకి పంపించి తమ సామాజికవర్గ అభివృద్ధికి వారితో పనిచేయించుకోవాలి.కానీ ముదిరాజు సామాజికవర్గంలో పుట్టగొడుగుల్లా సంఘాలు ఏర్పడుతూ,అద్యక్షులలో మార్పు ఉండకపోగా రాజకీయపార్టీలకు అనుబంధసంస్థలుగా పనిచేస్తూ అధికార,ప్రతిపక్షపార్టీల వలే ఒకరిపైమరొకరు ఆరోపణలు,ప్రతిఆరోపణలు చేసుకుంటూ తమ సామాజికవర్గ ఐక్యతను దెబ్బతీస్తూ ‘పలువురిలో పలచన అయ్యేలా’ చేస్తూ ఓటుబ్యాంకు రాజకీయాలకు పరిమితమయ్యేవిధంగా పనిచేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
   1970లో అనంతరామన్ కమిషన్ వెలువడినప్పటి నుండి ముదిరాజులకు రిజర్వేషన్లలో అన్యాయం జరిగిందని గ్రహించి ఎన్నో పోరాటకార్యక్రమాల అనంతరం 2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో జీవో నంబర్ 15 ద్వారా ముదిరాజులను బిసి-డి నుండి బిసి-ఏ లోకి కలపడం జరిగింది.కానీ కొన్ని మాసాలకే బిసి-ఏ లోని కొన్నికులాలు అభ్యంతరం వ్యక్తపరుస్తూ హైకోర్టును ఆశ్రయించడం ముదిరాజులతరఫున సరైన వాదనలు వినిపించకపోవడంతో,సుప్రీంకోర్టును ఆశ్రయించి పుష్కరకాలంపైగా 13సంవత్సరాలపాటు ముదిరాజులను విద్యా,ఉద్యోగ,ఆర్థిక,సామాజిక,రాజకీయంగా దెబ్బతీయడం చివరకు న్యాయస్థానంలో అలుపెరగనిపోరాటం చేయగా అక్టోబర్ 11,2022 న సుప్రీంకోర్టు ధర్మాసనం బీసీ కమిషన్ కు పంపుతూ,ఈ అంశానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి,ఆయా కులాలతో చర్చించి,విశ్లేషించి ఈసమస్యకు శాశ్వత పరిష్కారమార్గం చూపుతూ,నాలుగువారాల గడువులోపు రాష్ట్రప్రభుత్వానికి నివేదిక పంపాలని ఆదేశిస్తే నేటికీ ఏడుమాసాలకు చేరువవుతున్నకూడా దానిపై స్పందించకపోవడం వెనుకాలగల అంతర్యం ఏమిటో ఎవరికి అర్థంకాని పరిస్థితి. ఇదిలాఉంటే 6 జీవో రద్దువల్ల ముదిరాజులలోని మత్స్యకారులకు సభ్యత్వాలు ఎండమావిలా తయారయ్యాయి.దీనికితోడు ముదిరాజులకున్న చెరువులపై దాడి,లూటీలుజరిగి కేసులు,కోర్టులంటూ ఎంతో ఆర్థిక మనోవేదనకు గురవుతున్నప్పుడు పట్టించుకునే నాధుడేకరువయ్యాడు.ఇదిగాక ముదిరాజు దేవాలయాల పెద్దమ్మగుడి ప్రహరిగోడల కూల్చివేతలు,విడిసిల ద్వారా గ్రామ బహిష్కరణలు గావించడం,ముదిరాజు మహిళలపై హత్యాచారాలు జరగడం,ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలున్నాయి.వీరందరికీ న్యాయం జరిగేదేలా ? ఇకపోతే ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న ముదిరాజ్ సాహిత్యం భవిష్యత్తుతరాలకు అందకుండా ప్రణాళికయుతంగా కనుమరుగుచేయడానికి ప్రయత్నాలను ముబ్బరంగా కొనసాగిస్తున్నారు.అలాగే సమాజాభివృద్ధిలో కీలక బాధ్యతలు వహించి,ఆదర్శప్రాయాలుగా నిలిచిన మహనీయుల చరిత్రను కేవలం ముదిరాజు సామాజికవర్గానికి చెందడం మూలంగానే తీసుకురాలేకపోతున్నారని తెలుస్తుంది.ఇలా ముదిరాజుకులంపై అగ్రకులాలు,ప్రభుత్వాలు కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నప్పుడు ముదిరాజుసంఘాలు వీటి విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నాయో అర్థంకాని పరిస్థితి.
   “పోరాడితే పోయేదేమీలేదు-బానిస సంకెళ్లు తప్ప” ఏ సమస్యకైనా సంఘటితమై పోరాటం చేసినప్పుడే పరిష్కారం లభిస్తుంది.అంతేగాని అమాయకప్రజలను ఆసరాగాచేసుకుని రాజకీయాలుచేసి జాతికి ద్రోహంచేయడం సరైనపద్ధతి అనిపించుకోదు.అంటే ఇక్కడ యావత్తు ముదిరాజుసమాజం ఐక్యమత్యమై ఒక్కత్రాటిపైకి వచ్చి,జాతికి ద్రోహంచేసే నాయకులను ఎండగడుతూ,సమస్యల పరిష్కారాలకై పోరాటాలుచేసినప్పుడే సమస్యలు తీరుతాయి.ఈ క్రమంలోనే చైతన్యంకలిగి ముదిరాజులకు రావాల్సిన న్యాయమైనహక్కులను సాధించుకోవడానికి దోహదపడుతుంది.అంతేగాని “ఎవరో వస్తారు- ఏదో చేస్తారని” మౌనంగా కూర్చుంటే జరిగేది శూన్యం అని ప్రతిఒక్కరు గ్రహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
    ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కనిపిస్తుంది.అందుకే యావత్తు ముదిరాజు సామాజికవర్గం బీసీకమిషన్ మరియు ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చే కార్యక్రమాలు గావించి ఎన్నికలముందే జీవో నెంబర్ 15 అమలుపరిచేవిధంగా కార్యచరణగావించి పోరాటాలఫలితంగా విజయం సాధించినప్పుడే చట్టసభలలో,స్థానికసంస్థలలో జనాభా ప్రాతిపదికలో మనవాట మనం పొందడానికి దోహదపడుతుంది.కావున ప్రతిఒక్కరు ఆదిశగా అడుగులువేసి శాంతియుతంగా ఉద్యమాలు చేసి,న్యాయపరంగా హక్కులు, అవకాశాలు పొందాలని ఆశిద్దాం.