Monday , September 16 2024

కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి._ పుచ్చలపల్లి సుందరయ్య నేటి యువతకు ఆదర్శం._ సిపిఎం నర్సాపూర్ డివిజన్ కార్యదర్శి కడారి నాగరాజు.

తెలంగాణ కెరటం మెదక్ జిల్లా ప్రతినిధి మే 20:

పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా నర్సాపూర్ పట్టణంలోని స్థానిక కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నర్సాపూర్ డివిజన్ కార్యదర్శి కడారి నాగరాజు మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య దక్షిణ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఉద్యమ నిర్మాతగా, సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శిగా, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించి 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచడంలో చాలా కీలక పాత్ర పోషించడన్నారు. పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడుగా ఉండి, దేశంలోని అనేక ప్రజా సమస్యలు లేవనెత్తినటువంటి గొప్ప వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అన్నారు. సుందరయ్య పేరు చెబితే ప్రతిపక్ష నాయకులతో సహా, శత్రు వర్గాలు కూడా ఆయనను కొనియాడెటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉందన్నారు. ఆనాడు నెహ్రూ ఆయనను ప్రస్తావిస్తూ సుందరయ్య గారిని తీసుకుపోయి సముద్రంలో పడేస్తే సముద్రంలో ఉన్న చేపలను అన్నీ కూడా కమ్యూనిస్టులు గా మార్చేస్తాడని ప్రస్తావించిన పరిస్థితి ఉందన్నారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన యావదశినంత కూడా పేద ప్రజలకు పంచిపెట్టి, త్యాగం చేసి, దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించి, పిల్లలను కూడా కనకుండా సమాజ సేవ చేశారన్నారు. పార్లమెంటుకు ఆ రోజుల్లో సైకిల్ మీద ప్రయాణం చేసినటువంటి ఘనత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యకు ఉందన్నారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య కేవలం ప్రజా పోరాటాలు, వర్గ పోరాటాలే కాదు, ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహించి కూడా, అనేక రకాలుగా ప్రజలకు అండగా నిలబడ్డ వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. ఆశయాలు ముందుకు తీసుకోవడం కోసం సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా ఆ రకమైన కృషిని చేస్తుందన్నారు. ఈనాటికి కూడా భూములు పంచాలని, కూలీ పెంచాలని, దోపిడి వ్యవస్థ కూలగొట్టాలని, సోషలిజం నిర్మించాలని సిపిఎం పార్టీ ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తుందన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు ఆర్పించేటటువంటి నిజమైన నివాళి ఈ దేశంలో వర్గ పోరాటాన్ని పెద్ద ఎత్తున పెంచడం, ఇవాళ దేశంలో పెట్రేగిపోతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా, కులోన్మాదానికి వ్యతిరేకంగా, ప్రాంతీయ తత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజా ఉద్యమాలకు సిపిఎం పార్టీ అంకితమై పనిచేస్తుందన్నారు. నేటి యువత కూడా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యను ఆదర్శంగా తీసుకుని, ప్రజా జీవితాలకు అంకితం అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం, పోచయ్య, సౌమ్య నాయక్, రమేష్ రెడ్డి, మహేష్, శంకర్, మల్లేశం, కుమార్ తదితరులు పాల్గొన్నారు.