Saturday , October 12 2024

నూతన మేయర్ గా శాంతి కోటేష్ గౌడ్

– జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏకగ్రీవంగా మేయర్ ఎన్నిక

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బ్యూరో, మార్చ్ 18 (తెలంగాణ కెరటం)

జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా దొంతగోని శాంతి కోటేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మేడ్చల్ జిల్లా బి ఆర్ ఎస్ చైర్ పర్సన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డిలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్ శాంతి కోటేష్ మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా కొనసాగిన అవిశ్వాస తీర్మానంలో 20 మంది కార్పొరేటర్లు తనను ఏకగ్రీవంగా మేయర్ గా బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. గత నాలుగు సంవత్సరాల్లో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదని నిరాశ నిస్పృహకు గురైన వారందరికీ కూడా తగు న్యాయం చేసి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా కృషి చేస్తానని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తోటి డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులందరితో తగిన సలహా సూచనలు తీసుకుంటూ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా, కార్పొరేటర్లు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.