Sunday , May 26 2024

మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ కు సంబంధించిన ప్రతి అంశంపై అవగాహన

తెలంగాణ కెరటం
04 మే కామారెడ్డి ప్రతినిధి

మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ కు సంబంధించిన ప్రతి అంశంపై అవగాహన ఏర్పర్చుకోవాలని, అప్పుడే పోలింగ్ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించగల్గుతారని అన్నారు.మాక్ పోల్, తదనంతరం చేపట్టే పోలింగ్ ప్రక్రియలు నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకంగా జరుగుతున్నాయా లేదా అన్నది నిశిత పరిశీలన చేయాలని, గమనించిన అంశాలను జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలూ ఉన్నాయా లేవా అన్నది గమనించాలని, సీక్రెట్ పోలింగ్ కంపార్ట్మెంట్ సరిగానే ఏర్పాటు చేశారా అన్నది పరిశీలించాలన్నారు. ఎక్కడైనా సాంకేతిక లోపాల వల్ల ఈ.వీ.ఎం లు పనిచేయకపోతే, వాటి స్థానంలో వేరే ఈ.వీ.ఎం లను ఎలా అమరుస్తున్నారు అన్నది పరిశీలన చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర అధికారులు నిర్వర్తిసున్న విధులను గమనించాలని, టెండర్, ఛాలెంజ్ ఓటింగ్ లు జరిగితే వాటి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అయితే పోలింగ్ ప్రక్రియ తీరుతెన్నులను పరిశీలించడం వరకే మైక్రో అబ్జర్వర్ల బాధ్యత అని, ఎక్కడ కూడా పోలింగ్ విధుల్లో జోక్యం చేసుకోకూడదని కలెక్టర్ హితవు పలికారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి పూర్తయ్యేంత వరకు అన్ని అంశాలను గమనిస్తూ, ఎప్పటికప్పుడు వాటిని జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని, ఓటింగ్ గోప్యతను కాపాడే విధంగా మైకో అబ్జర్వర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఉదయం 7.00 గంటలకు పోలింగ్ ప్రారంభమై, సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఆరు గంటల లోపు పోలింగ్ కేంద్రం లోనికి వచ్చిన ఓటర్లు ఇంకను మిగిలి ఉంటే, వారిని వరుసక్రమంలో నిలబెట్టి చివరి నుండి ముందు వరుసలో ఉన్న ఓటరు వరకు క్రమ సంఖ్య చీటీలు అందించి పోలింగ్ జరిపించాల్సి ఉంటుందన్నారు. ఈ అంశాలన్నింటినీ మైక్రో అబ్జర్వర్లు నిశితంగా పరిశీలించాలన్నారు. సమస్యాత్మక కేంద్రాలలో మరింత ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, పోలింగ్ కేంద్రం బయట, పరిసర ప్రాంతాల్లోనూ జరిగే అంశాలను గమనిస్తూ జాగరూకతతో వ్యవహరించాలని అన్నారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు ప్రభావితం చేయకుండా నిఘా ఉంచాలని, ఎన్నికల సంఘం గుర్తింపు కార్డులు కలిగిన వారు, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న వారు మినహా, ఇతరులెవరిని పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అందిస్తున్న శిక్షణ తరగతుల్లో సూచించిన అంశాలను చక్కగా ఆకళింపు చేసుకుని సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని మైక్రో అబ్జర్వర్లకు సూచించారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ ఎలా సాగుతున్నదని గమనించడమే మైక్రో అబ్జర్వర్ల పాత్ర అని అన్నారు. జిల్లాలో రిజర్వు సిబ్బందితో కలుపుకొని 99 మంది మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇస్తున్నామని, ఆకళింపు చేసుకొని సమర్థవంతంగా విధులు నిర్వహించాలని కాలరారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా నిశితంగా పరిశీలించాలని ఏదేని సంఘటన జరిగితే మీ నివేదికలు కీలకమని అన్నారు. కాబట్టి ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం విధులు నిర్వహించాలని, ఎక్కడ జోక్యం చేసుకోరాదని అన్నారు. తమకు కేటాయించిన లొకేషన్ లలో 2,3 పోలింగ్ బూతులు ఉన్నా ఆయా కేంద్రాలలో విద్యుత్, మంచినీరు, ఫర్నీచర్,వీల్ చై, రాంప్ వంటి మౌలిక వసతులు ఉన్నాయా గమనించాలన్నారు. ప్రతి పోలింగ్ బూతుకు సంబందించేసి విడివిడిగా నివేదికలు ఇవ్వాలన్నారు. ఈసీ ఐ మార్గదర్శకాల మేరకు మాక్ పోలింగ్ నిర్వహించి కంట్రోల్ యూనిట్ క్లియర్ చేశారు, వివిప్యాట్ స్లిప్స్ తీసి బ్లాక్ కవర్ లో సీల్ చేశారా, ఒక పార్టీకి ఒకరే పోలింగ్ ఏజెంట్ ఉన్నారా, ప్రిసైడింగ్ అధికారి టైం టు టైం డైరీ రాస్తున్నారా గమనించాలని, పోలింగ్ అనంతరం వివిప్యాట్, ఏవిఎం ల సీలింగ్ సరిగ్గా జరిగిందా చూడాలన్నారు. 18 అంశాలకు సంబంధించిన నివేదికను ఎప్పటికప్పుడు జనరల్ అబ్జర్వర్ కు నేరుగా పంపాలని సూచించారు. 17-ఏ రిజిస్టర్ నిర్వహణ, పోల్ పూర్తి అయ్యేంత వరకు జరిగే ప్రక్రియపై నివేదికలు ఇవ్వాలని, ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరిగితే జనరల్ అబ్జర్వర్ కు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో నోడల్ అధికారులు వరదా రెడ్డి, రాజారామ్, రఘునాథ రావు , మైక్రో అబ్జర్వర్లు తదితరులు పాల్గొన్నారు.