తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి మే 4:
శనివారం కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేపడుతున్న ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకులు గోపాల్ జి తివారితోపాటు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఎన్నికల సాధారణ పరిశీలకులు గోపాల్ జి తివారి మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కమిషనింగ్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు.
ఈవీఎంలపై సీరియల్ నెంబర్లు, అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన చిహ్నాల ఏర్పాటు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. కమిషనింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి, ఈవీఎంల పనితీరు పరిశీలించాలన్నారు. అలాగే స్ట్రాంగ్‌రూమ్ నిర్వహణ వివరాలను ఏఆర్‌ఓలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రఘునాథరావు, అధికారులు పాల్గొన్నారు.