Monday , July 22 2024

హోమ్ ఓటింగ్ నిర్వహణపై పై పోలింగ్ అధికారులకు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 19:

శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో హోమ్ ఓటింగ్ పోలింగ్ బృందాలు, మైక్రో అబ్జర్వర్లకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతూ భారత ఎన్నికల కమీషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని 80 సంవత్సరాలు పైబడిన వృద్దులకు, దివ్యంగులకు, అత్యవసర పౌర సేవలలలో నిమగ్నమైన వారికీ కల్పించిందని అన్నారు. సాధారణ పోలింగ్ తేదికి ముందుగానే ఈ ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు. ఫారం-12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్న ఓటర్లు తప్పనిసరిగా బ్యాలెట్ ద్వారానే ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటరు జాబితాలో వారి పేరును రెడ్ పెన్ తో మార్క్ చేయబడుతుందని, పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయడానికి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ లో పోటీ చేసే అభ్యర్థి పేరు, ఏ పార్టీ కు చెందిన వారు అని మాత్రమే ఉంటుందని, పార్టీ గుర్తు ఉందని, ఎంచుకున్న అభ్యర్థికి ఎదురురుగా రైట్ టిక్ మార్క్ చేయవలసి ఉంటుందని అన్నారు. ఫారం 13-ఏ లో ఓటరు ఇచ్చే ధ్రువీకరణ, పోస్టల్ బ్యాలెట్ పై సంతకం చేయించాలని, గజిటెట్ అధికారి అటెస్ట్ చేయాలనీ అన్నారు. 13-బి ఇన్నర్ ఎన్వలప్ , 13-సి ఓటర్ ఎన్వలప్, 13-డి ఎలక్టర్ సూచనలపై అవగాహన కలిగించారు. రూట్ మ్యాప్ ప్రకారం నిర్దారిత తేదీలో వీడియో టీమ్, అభ్యర్థి లేదా ఏజెంట్లతో కలిసి ఓటరు గృహాలకు వెళ్లి పారదర్శకంగా ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, ఆ సమయంలో ఓటరు అందుబాటులో లేకపోతె మరోసారి సందర్శించాలని, సెక్టార్ అధికారులు పర్యవేక్షించాలని అన్నారు.
గత శాసన సభ ఎన్నికలలో సుమారు 500 మందికి పైగా ఈ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహించారని, ఈ దఫా పార్లమెంటు ఎన్నికలలో కూడా ఎలాంటి తప్పిదాలకు అవకాశమివ్వకుండా పూర్తి విశ్వాసంతో ఎన్నికల సంఘం నిబంధనలు, మార్గదర్శకాల మేరకు హోమ్ ఓటింగ్ ప్రక్రియ విజయవంతం చేయాలని, ఏమైనా సమస్యలు తలెత్తితే పరిష్కారానికి వెంటనే తనకు తెలియజేయాలని కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో డిపిఓ శ్రీనివాస్, డిఆర్ డిఓ ఎపిడి మురళీకృష్ణ, డీఈఓ రాజు, మత్స్య శాఖ ఎడి వరదా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.