తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 11:
మహాత్మా జ్యోతిబా పూలే 198 వ జయంతి సందర్భంగా గురువారం పట్టణంలోని మునిసిపల్ కార్యాలయం వద్ద గల పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖా ఆధ్వర్యంలో అధికారికంగా ఏర్పాటు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ కుల వ్యవస్థలో లోపాలను గుర్తించి ఆనాడే సామాజిక సమానత్వం సాధన కోసం జ్యోతి బా పూలే సంస్కరణల కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. చదువుతోనే జీవితంలో మార్పు సాధ్యమని విద్య ప్రాముఖ్యతను గుర్తించి తన భార్య సావిత్రి పూలే కు చదువుచెప్పించి అందరు మహిళలు కూడా చదువుకుంటే కుటుంబంతో పాటు సమాజం అభివృద్ధి చెందుతుందని భావించి కార్యోన్ముకులు కావడంవల్లే నేడు మహిళలు ఉన్నత శిఖరాలు అధిరోహించారని అన్నారు. తరతరాల తలరాతను మార్చేది చదువు ఒక్కటే అని ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలని , మహనీయుల చరిత్రను తెలుసుకొని వారి ఆశలు, ఆశయాలకనుగుణంగా ముందుకు సాగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బి.సి.అభివృద్ధి అధికారి శ్రీనివాస్, సహాయ బిసి అభివృద్ధి అధికారి యాదగిరి, చక్రధర్ , నరేష్ తదితరులు పాల్గొన్నారు.