తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 10
తాగునీటి సరఫరా లో వచ్చే ఇబ్బందులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి వేసవిలో తాగునీటి సరఫరా ప్రణాళిక, ధాన్యం కొనుగోలు, పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనపై, వడదెబ్బ తగలకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, చంద్రమోహన్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ వేసవికాలం పూర్తి చేసుకోని వర్షాలు వచ్చేవరకు తాగు నీటి సరఫరా అంశం పై అప్రమత్తంగా ఉండాలని, క్షేత్ర స్థాయిలో తాగు నీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు.
వార్తా పత్రికలలో, ఎలక్ట్రానిక్ మీడియాలో తాగునీటి సరఫరాకు సంబంధించి జిల్లాలో రూపొందించుకున్న ప్రణాళిక , నీటి సరఫరా లో ఎదురవుతున్న సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు తీసుకుంటున్న చర్యలు , నీటి పునరుద్ధరణ వివరాలు తెలియజేయాలని అన్నారు. తాగు నీటి సంబంధించి ప్రజలు ఎక్కడ ఆందోళనలు చేయాల్సిన అవసరం లేకుండా చూసుకోవాలని సీఎస్ తెలిపారు.
వేసవి కాలంలో తాగు సరఫరాకు సంబంధించి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసి సన్నద్దంగా ఉన్నామని, ఇటీవల సామాజిక మాధ్యమాల్లో, వార్తా పత్రికలలో త్రాగునీటి సరఫరా ఇబ్బందుల గురించి వచ్చిన అంశాలను, వాటికి గల కారణాలు, ఆ సమస్యలను పరిష్కరించిన తీరు వివరాలను సీఎస్ అడిగి తెలుసుకున్నారు.
ప్రతి జిల్లాలో తాగునీటి సరఫరాకు సంబంధించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, క్షేత్ర స్థాయిలో వచ్చే ఇబ్బందులను పరిష్కరించేందుకు అవసరమైన బృందాలను ఏర్పాటు చేయాలని, తాగునీటి సరఫరాకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి రెగ్యులర్ ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నారు.
పట్టణాలలో ఏర్పడిన నూతన కాలనీలు, చివరి ఆవాస ప్రాంతాలు తాగు నీటి సరఫరా పై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని,పట్టణాలలో గ్రామాలలో తాగునీటి సరఫరా ఇబ్బందులు ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా సప్లిమెంట్ చేయాలని సిఎస్ పేర్కొన్నారు.
రానున్న రెండు నెలల పాటు క్షేత్రస్థాయిలో తాగునీటి సరఫరా లో ఉత్పన్నమయ్యే సమస్యలను వెంటనే గురించి వాటిని సత్వరం పరిష్కారం అయ్యే విధంగా చూడాలని, తాగునీటి సరఫరా ను ప్రతిరోజు పర్యవేక్షించాలని సీఎస్ పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సూచించారు.
వానాకాలం 2023-24 కు సంబంధించి సీఎంఆర్ రా రైస్ డెలివరీ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, భారత ఆహార సంస్థ నిర్దేశించిన సమయానికి రైస్ డెలివరీ చేసే విధంగా ప్రతి జిల్లాలో రైస్ మిల్లుల పనితీరును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని, ప్రతిరోజు రైస్ మిల్లులు పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిచేలా చూడాలని, సిఎంఆర్ రా రైస్ డెలివరీ పై కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందని సిఎస్ పేర్కొన్నారు.
యాసంగి ధాన్యం కొనుగోలు అంశాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధర పై పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం జరుగుతుందని, ధాన్యం కొనుగోలు అంశంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే త్వరితగతిన సంబంధిత రైతుకు చెల్లింపులు జరిగేలా చూడాలని అన్నారు.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలకు కనీస మౌలిక సదుపాయాల కల్పన పనులు సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. తాగునీటి సౌకర్యం, నిరుపయోగంగా ఉన్న టాయిలెట్లను ఉపయోగంలోకి తీసుకుని రావడం, అదనపు టాయిలెట్ల నిర్మాణం, తరగతి గదుల మైనర్, మేజర్ మరమ్మత్తులు తరగతి గదులకు విద్యుత్ సౌకర్యం కల్పన వంటి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు
పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పనకు ప్రతి మండలంలో పనుల పర్యవేక్షణకు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ నియమించాలని , పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని , ప్రతి పాఠశాలలో అవసరమైన పనులు పాఠశాలలు ప్రారంభం అయ్యే ముందే పూర్తి చేయాలని సీఎస్ సూచించారు.
వడదెబ్బ తగిలిన వారికి అవసరమైన ప్రథమ చికిత్స సత్వరమే అందేలా చూడాలని, క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బందికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని, ఉపాధి హామీ పనులను ఉదయం పూట నిర్వహించాలని, ఉపాధి హామీ పనుల నిర్వహణ సమయంలో కార్మికులకు అవసరమైన మేరకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని అన్నారు .
వడ గాల్పులు వీస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, అత్యవసరం ఉంటేనే ప్రజలు బయటకు రావాలని, బయటకు వస్తే అవసరమైన జాగ్రత్తలు పాటించాలని, వడ గాల్పులు గురైన వ్యక్తులను వెంటనే అవసరమైన ప్రధమ చికిత్స చేసి సమీప ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులతో మాట్లాడారు. డివిజన్ల వారీగా తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీటి ఎద్దడి లేకుండా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు.
వీసీలో కలెక్టర్ జడ్పీ సీఈవో చందర్ నాయక్ డీపీఓ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, జిల్లా పౌర జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ నిత్యానంద్, డీఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్, పంచాయతీ రాజ్ ఈఈ సదాశివరెడ్డి, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది.