- మెట్పల్లి డీఈ తిరుపతి
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, మే, 04 : ఉన్నతమైన భద్రతా ప్రమాణాలు పాటిస్తే విద్యుత్ ప్రమాదాలను నివారించి విలువైన ప్రజల ప్రాణాలు పరిరక్షిoచవచ్చని మెటుపల్లి డీఈ తిరుపతి అన్నారు. విద్యుత్ భద్రతా వారోత్సవాల్లో భాగంగా శనివారం కోరుట్ల పట్టణంలోని స్టార్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్మికుల అవగాహన సదస్సులో డీఈ పాల్గొని పలు సూచనలు చేశారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే కార్మికులు హెల్మెట్, సేఫ్టీ బెల్ట్ ధరించి, ఎర్త్ డిశ్చార్జ్ రాడ్ వేసుకొని పనికి ఉపక్రమించాలని సూచించారు. తాము పని చేయవలసిన ఫీడర్ పై సరియైన లైన్ క్లియర్ తీసుకోవాలని, రెండు ఫీడర్ల క్రాసింగ్ లు దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. తోటి ఉద్యోగులతో సమన్వయంతో పని చేయాలని కోరారు. వినియోగదారులను జాగృతం చేసే బాధ్యత విద్యుత్ ఉద్యోగులు తీసుకోవాలని అన్నారు. రైతులు వ్యవసాయ పంపు సెట్లకు ఫైబర్ బాక్స్ లు అమర్చుకోవాలని, ఇంటి ఆవరణలో బట్టలు ఆరవేయడానికి దండెము కొరకు జీఐ వైరు వాడవద్దని, తడిబట్టలకు ఇన్సులేషన్ పాడైపోయిన వైరింగ్ తగిలితే షాక్ వల్ల మరణం సంభవిస్తుందని ఇందుకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎవరైనా షాక్ గురైతే రక్షించాలన్న ఆత్రుతతో తాకరాదని, ఏదైనా కర్ర సహాయంతో విడదీయాలని సూచించారు. రైతులు తమ పంటలను అడవి పందుల బారి నుండి రక్షణ కొరకు అక్రమంగా విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తే నేరమని, చేపల వేటకు కరెంటు వాడవద్దని, అలాంటి సంఘటనలు దృష్టికి వస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మనుషులు, మూగ జీవాల ప్రాణాలు చాలా విలువైనవని ఉద్బోధించారు. ఈ సదస్సులో ఏడీఈలు అంజనేయరావు, రఘుపతి, ఏఈలు సబ్ ఇంజినీర్ లు, కార్మిక నాయకులు, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.