Monday , September 16 2024

ఇచ్చిన హామీలు అమలు చేయాలి

టిఆర్ఎస్ వై రాష్ట్ర కార్యదర్శి రావుల రాజలింగారెడ్డి
తెలంగాణ కెరటం:
హుజూరాబాద్ నియోజకవర్గం, ఫిబ్రవరి 25:
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మేకపోతు గాంభీరం ప్రదర్శిస్తున్నదని బిఆర్ఎస్ వై రాష్ట్ర కార్యదర్శి రావుల రాజలింగారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాదులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరిస్తుందని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటే అమలు చేస్తుందని మిగిలిన హామీలను వెంటనే అమలు చేయాలని లింగారెడ్డి డిమాండ్ చేశారు. యాసంగి పంటలకు కావలసిన సాగునీరు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కెనాల్ కాల్వలను నమ్ముకుని పంటలు సాగు చేస్తున్న రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందక చాలా చోట్ల వేసిన పంటలు ఎండిపోతున్నాయి అన్నారు. చెరువులను కెనాల్ కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలని, చెరువుల్లో పుష్కలంగా నీళ్లు ఉంటేనే యాసంగి పంటలు పండే అవకాశం ఉందన్నారు. పంటలు పూర్తిగా ఎండిపోక ముందే నీటిని చెరువులో నింపి రైతులను ఆదుకోవాలని అన్నారు. అలాగే రైతులకు సాగునీటి సమస్య తలెత్తింది అని తెలిసి కూడా తగిన చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు నాణ్యతలేని కోతల కరెంటుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు రైతు సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట ప్రోటోకాల్ అమలు చేయకుండా ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని ఆయన విమర్శించారు. రైతుల రుణమాఫీ రెండు లక్షలు ఒకే విడుతలో అమలు చేయాలని, ఆరు గ్యారెంటీలను ఈ నెలాఖరులోగా ఒకేసారి అన్ని అమలు చేయాలని రాజలింగారెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజా ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.