Saturday , October 12 2024

ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే విచారణ అధికారి

తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో


ఓపెన్ పది పరీక్షలలో అక్రమాలలో భాగస్వామి అని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఈఓ నే విచారణ అధికారి
విచారణ సక్రమంగా జరిగేదెలా?
తప్పుదోవ పట్టించేలా జిల్లా విద్యాధికారి తీరు

కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన ఓపెన్ విద్య పరీక్షల్లో జరిగిన చూచిరాత పరీక్షలతో జిల్లా విద్యాశాఖ తీరు రాష్ట్రంలోనే ఒక సంచలనం సృష్టించింది . ఓపెన్ విద్య పరీక్షల్లో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయి. ఓపెన్ పరీక్షలు పరీక్ష కేంద్రంలో కాకుండా పరీక్ష కేంద్రానికి దగ్గరలో ఉన్న ఇతర ప్రాంతాల్లో పరీక్షలు రాయించారు. పరీక్ష రాసే అభ్యర్థికి మరి ఒకరితో పరీక్షలు రాయించారు .దానికి ఒక్కో అభ్యర్థి నుంచి 15000 నుండి 20,000 రూపాయల వసూలు చేశారు. ఈ వసూలు వ్యవహారం అంతా ఎంఈఓ ఎల్లయ్య కనుసన్నుల్లోనే జరిగిందని ఆధారాలు ఉన్నాయి. ఇట్టి ఆధారాలతో కొందరు వ్యక్తులు జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అక్రమాలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఈఓ ఎల్లయ్య ను ఓపెన్ విద్యలో జరిగిన వాస్తవాలను నిర్ధారణ చేయడానికి విచారణ అధికారిగా నియమించారు. అవినీతిపరుడినే విచారణ అధికారిగా నియమించడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాను చేసిన తప్పుకు తానే విచారణ అధికారిగా ఎంతవరకు నిజాలు బయటకు వస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని విచారణ అధికారిగా నియమించిన జిల్లా విద్యాశాఖ అధికారి పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు .ఇట్టి విషయమై డిఇఓ రాజును వివరణ కోరగా జిల్లా కేంద్రంలో మొత్తం పరీక్ష కేంద్రాల్లో జరిగిన అక్రమాలపై నిజాలను వెలికి తీసేందుకే ఎంఈఓ ఎల్లయ్యతోపాటు మరొకరిని విచారణ అధికారిగా నియమించామన్నారు. అక్రమాలలో భాగస్వామ్యం ఉందని ఆరోపణలు ఉన్న ఎంఈఓ ఎల్లయ్యను ఏ విధంగా విచారణ అధికారిగా నియమించారని ప్రశ్నించగా జిల్లా విద్యాధికారి మాట దాటవేశారు .