Wednesday , September 18 2024

వడదెబ్బతో మండల విద్యాధికారి భూమయ్య మృతి

నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎమ్మెల్యే సత్యం

తెలంగాణ కెరటం మే 4 ధర్మపురి ప్రతినిధి

జగిత్యాల జిల్లా వెల్గటూర్, ధర్మపురి, ఎండపల్లి, బుగ్గారం మండలాల విద్యాధికారి బత్తుల భూమయ్య వడదెబ్బతో శనివారం ఉదయo మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సభకు విధుల నిమిత్తం హాజరైన ఆయన సాయంత్రం నుండి అస్వస్థతకు గురైనట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 3గంటలకు తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను అంబులెన్స్ లో కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యలో తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. నాలుగు మండలాలకు విద్యాధికారిగా విధులు నిర్వహిస్తూనే మరోపక్క మూడు గ్రామాలకు ప్రత్యేక పాలనాధికారిగా సేవలు అందిస్తున్నారు. భూమయ్య మృతి విద్యాశాఖకు తీరని లోటు అంటూ పలువురు కంటతడిపెట్టారు. మండల విద్యాధికారి ఆకస్మిక మరణవార్త తెలుసుకున్న ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎంఈవో బత్తుల భూమయ్య భౌతికకాయానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. భూమయ్య మృతి విద్యాశాఖకు తీరని లోటన్నారు.

భూమయ్య భౌతిక కాయనికి నివాళులు అర్పించిన పలువురు

ఎంఈవో బత్తుల భూమయ్య భౌతిక కాయానికి జగిత్యాల డీఈఓ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. భూమయ్య విద్యా శాఖకు చేసిన సేవలు మరవలేనివి అన్నారు. వృత్తిపట్ల అంకితభావం కలిగిన అధికారిగా భూమయ్యను కొనియాడారు. అదేవిధంగా వెల్గటూర్ మండల జడ్పీటీసీ సభ్యులు బి. సుధారాణి-రామస్వామి, టీడబ్ల్యూజేఎఫ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుశనపెల్లి రాజేందర్,కార్యదర్శి తరాల అథిక్, కోశాధికారి మంచాల ఓదెలు, గౌరవ అధ్యక్షులు జక్కపురం స్వామి, డీటీఎఫ్ జిల్లా నాయకులు నీలం సంపత్ తదితరులు నివాళులు అర్పించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.