Wednesday , July 24 2024

బీజేపీ, బీఆర్ఎస్ ను ఓడించండి

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్

తెలంగాణ కెరటం చేర్యాల ప్రతినిధి మే 4:

మతోన్మాద బీజేపీ, నిరంకుశత్వ బీఆర్ఎస్ పార్టీలను ఓడించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ కోరారు. సీపీఐ పార్టీ బలపర్చిన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకై సీపీఐ మండల కౌన్సిల్ సభ్యులు, ముఖ్య కార్యకర్తల సమావేశం భువనగిరి పట్టణంలోని శ్రీ సాయి కన్వెన్షన్ హాల్ లో జరిగే సభకు శనివారం చేర్యాల నుండి సీపీఐ ముఖ్య నాయకులు తరలివెళ్లారు. ఈసందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు అందె అశోక్ మాట్లాడుతూ… కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత రాజకీయాలకు పాల్పడుతూ ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా పరిశ్రమలు నెలకొల్పకుండా విభజన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను బడా పెట్టుబడిదారులకు అప్పనంగా కట్టబెడుతుందని, పెట్రోల్ డీజిల్, వంట గ్యాస్ నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అప్పుల ఊబిలోకి నెట్టివేసిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఏమాత్రం భర్తీ చేయలేదన్నారు. రైతు రుణమాఫీ, రేషన్ కార్డులు, ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కుటుంబ నియంత పాలన కొనసాగించిన బీఆర్ఎస్ పార్టీని తరిమికొట్టాలన్నారు. మతోన్మాద నిరంకుశ బిజెపి పార్టీని ఓడించి ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించి భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, డివిజన్ నాయకులు జంగిలి యాదగిరి, కత్తుల భాస్కర్ రెడ్డి, రామగళ్ల నరేష్, పొన్నబోయిన మమత, నంగి కనకయ్య, గజ్జల సురేందర్, ఎగుర్ల ఎల్లయ్య, అందె బాబు, బీ. వరలక్ష, కె. విజయ, కొన్నింటి రాజు, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.