ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థుల భవితవ్యం తేల్చేది నారీమణులే
ఐదు నియోజకవర్గాల్లో మహిళలదే ఆధిపత్యం
పురుషుల ఓట్ల కంటే 40 వేల ఓట్లు అత్యధికం
మహిళల చుట్టూ రాజకీయం
తెలంగాణ కెరటం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి ( కౌటాల ) : మే 04
ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యం మహిళల చేతుల్లోనే ఉన్నది. ఐదు నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు 40 వేల మంది ఉన్నారు. దీంతో వారు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వారే విక్టరీ అవుతారు. గెలుపు ఓటములను నిర్ణయించే శక్తి ఉన్న నారీమణుల చుట్టూ రాజకీయం తిరుగుతున్నది. అన్ని రాజకీయ పార్టీలు మహిళలను ప్రసన్నం చేసుకోవడానికి రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి మహిళ లీడర్లను రంగంలోకి దింపుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. ఇంటింటా తిరుగుతూ బొట్టు పెట్టి ఓట్లను అభ్యర్థిస్తూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.
పురుషుల కంటే 40 వేల ఓట్లు అత్యధికం…
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 16.50.175 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 8,04,875 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 8.45,213 మంది, ఇతరులు 87 ఉన్నారు. పురుష ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్ల సంఖ్య 40,338 మంది అధికంగా ఉన్నాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇందులో సిర్పూర్ ( టి ) ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో మాత్రమే పురుష ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ఖానాపూర్, అదిలాబాద్, బోత్, నిర్మల్, ముధోల్ ఐదు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నాయి. వీరిఓట్లు ఎవరికి ఎక్కువగా దక్కుతాయో… వారికే విజయం వరిస్తుంది. అయితే గ్రామ, మండల, జిల్లా స్థాయిలో మహిళలను ప్రసన్నం చేసుకోవడానికి రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాళ్లను ఆయా
రాజకీయ పార్టీలు రంగంలోకి దింపాయి.
మహిళల చుట్టూ రాజకీయం..
అభ్యర్థుల భవితవ్యం నిర్ణయించే శక్తి మహిళా ఓటర్లకు ఉండగా.. ప్రస్తుతం అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వారి చుట్టే రాజకీయం తిరుగుతున్నది. ప్రత్యేక తైలాలను ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. స్థానిక సంస్థలు ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్ ఉండగా.. నామినేట్ పదవుల్లో తగిన గుర్తింపు ఇస్తామని ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం తమకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రాత్రి వేళ ‘స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. వారి అవసరాలను బట్టి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. తమను గెలిపిస్తే పురుషులతో సమానంగా 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ నిస్తున్నారు. అయితే మహిళా ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుంది..? ఆ అదృష్టవంతులు ఎవరో మరికొ న్ని రోజులు వేచి చూడాల్సిందే.