Tuesday , July 16 2024

అనుమతులంటే కష్టం.. అంతా మా ఇష్టం.. యథేచ్చగా ఇటుక బట్టీల నిర్వహణ గుట్టుగా సాగుతున్న దందా జిల్లా యంత్రాంగం ఎక్కడ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారా

జిల్లా యంత్రాంగం ఎక్కడ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారా

అనుమతులంటే కష్టం.. అంతా మా ఇష్టం..
యథేచ్చగా ఇటుక బట్టీల నిర్వహణ

గుట్టుగా సాగుతున్న దందా..
లక్షల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి..
బట్టీలలో అస్సాం, ఒరిస్సా కార్మికుల పాట్లు..
బగ్గిపాలవుతున్న వలస కూలీల బతుకులు
వర్తించని చట్టాలు, పట్టించుకోని అధికారులు..
‘మామూలు’గా తీసుకుంటున్న వైనం..

తెలంగాణకెరటం, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : కూసుమంచి మండలంలోని జుజ్జులరావుపేట గ్రామంలో ఇటుక బట్టీల నిర్వహణ జోరుగా సాగుతోంది. అక్రమ సంపాదనే ధ్యేయంగా వ్యాపారులు బట్టీలను నెలకొల్పి కోట్లు గడిస్తున్నారు. బట్టీల నిర్వహణలో నిబంధనలు పాతరేసి ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నుకు ఎగనామం పెడుతున్నారు. బట్టీల నిర్వహణతో పర్యావరణానికి ముప్పు వాటిల్లి కాలుష్యం పెరిగిపోతున్నా అధికారులు పట్టించుకునే పరిస్థితిలో లేరు. కలప వాడకంతో చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. విద్యుత్​ చౌర్యానికి గురవుతుంది. భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. నేల స్వభావాన్ని కోల్పోతుంది. పట్టించుకోవాల్సిన సంబంధిత అధికారులు అటుగా కన్నెత్తి చూడటంలేదు. కూసుమంచి మండలకేంద్రానికి కూతవేటుదూరంలోని జుజ్జులరావుపేట గ్రామంలో యథేచ్ఛగా సాగుతున్న బట్టీన నిర్వహణ, అక్రమ వ్యాపారంపై ‘తెలంగాణకెరటం’ ప్రత్యేక కథనం..

కూసుమంచి మండలకేంద్రానికి ఆనుకుని ఉన్న జుజ్జులరావుపేట గ్రామంలో ఇటుక బట్టీల నిర్వహణ జోరుగా సాగుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండానే బహిరంగంగా బట్టీలను ఏర్పాటు చేసి ఇటుకలను తయారు చేసి లక్షలు గడిస్తున్నారు. పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని వారి భూములను ఏళ్ల తరబడి లీజుకు తీసుకొని ఇటుకల దందా కొనసాగిస్తున్నారు. మైనింగ్​, రెవెన్యూ శాఖల మధ్య లోపించిన సమన్వయాన్ని క్యాష్​ చేసుకొని రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయితే బట్టీల నిర్వహణలో నిర్వాహకులు నిబంధనలను గాలికొదిలేసి మాకు ఎదురేలేదు అన్న రీతిలో వ్యాపారం సాగిస్తున్నారు. బట్టీ ఇటుకలను వరిపొట్టుతో కాల్చాలనే నిబంధన ఉన్నా కలపనే వినియోగిస్తున్నారు. ఫలితంగా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో చెట్లు ఉన్న ఆనవాళ్లను కోల్పోతున్నాయి. అడవులు అంతరించిపోతున్నాయి. దీంతో సకాలంలో వర్షాలు కురవక పంటలు సరిగా పండటం లేదు. కానీ దందా కొనసాగిస్తున్న అక్రమార్కులు సంబంధిత మైనింగ్​, రెవెన్యూ, పంచాయతీ అధికారులకు ముడుపులు చెల్లిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో అభివద్ధి కుంటుపడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సిన సెస్సు చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

అక్రమంగా కలప సేకరణ..
ఇటుక బట్టీల నిర్వహణకు ముఖ్యమైనది కలప. ఆ కలపను సేకరించాలంటే అటవీ శాఖ అధికారుల అనుమతులు తప్పనిసరి. కానీ అక్రమార్కులు కలప సేకరించేందుకు రోడ్ల వెంబడి పచ్చని చెట్టు కనిపిస్తే చాలు వేటు వేస్తున్నారు. అసరమైతే పొలాల్లో ఉండే భారీ వృక్షాలను సైతం కొనుగోలు చేసి కలప సేకరిస్తున్నారు. వాస్తవానికి కలప సేకరించాలంటే అటవీశాఖ అధికారులు అనుమతులు ఉంటేనే చెట్లు నరకాలి. కానీ గ్రామాల్లో ఇష్టారాజ్యంగా చెట్లు నరికి కలపను బట్టీలకు తరలిస్తున్నారు. అసలు బట్టీల వైపు అటవీశాఖ అధికారులు ఎప్పుడైనా వచ్చి తనిఖీ చేశారా అంటే అది కలలో కూడా జరగదు. ఎందుకని విస్మయానికి గురువుతున్నారా..? అటవీశాఖ అధికారులు ఎంచక్కా ఆఫీసులో కూర్చుంటే ఎంత ముడుపు చేరాలో అంత సంవత్సరం కాంట్రక్టుగా బట్టీల నిర్వాహకులు ముట్టచెబుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. అది నిజం కాకుంటే అధికారులు తనిఖీలు ఎందుకు చేయరు. అక్రమ కలప సేకరణకు అడ్డుకట్ట ఎందుకు వేయరు. ఆ కలపతో బట్టీలు కాల్చడంతో పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతోంది. సమీప ప్రాంతాల ప్రజలు నిర్విరామంగా వస్తున్న పొగతో అనారోగ్యం పాలవుతున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్​ శాఖ అధికారుల అండదండలు..
ప్రభుత్వం వ్యవసాయానికి అందిస్తున్న విద్యుత్​ను ఇటుక బట్టీల నిర్వాహకులు తమ వ్యాపారానికి వినియోగిస్తున్నారు. నడిగ్రామంలో నివసిస్తూ రేకులషెడ్డో, తడకల ఇళ్లో కట్టుకుని నివాసము ఉంటున్న సామాన్యులకు కరెంట్​ మీటర్​ అడిగితే ఇంటిపన్ను, ఇంటి నెంబర్​, అంటూ సవాలక్ష ఆధారాలు అడిగి నానా ఇబ్బందులకు గురిచేసి ఆఖరుకు ముట్టచెప్పాల్సిన ముడుపులన్నీ అందరికి అందిన తరువాత కాని మీటరు పెట్టని విద్యుత్​ అధికారులు, అడవిలో ఊరికి సంబంధంలేని చోట ఏ ఆధారం లేకుండా విద్యుత్​ ​ వాడుకోవడానికి అనుమతి ఎలా ఇచ్చారా అనేది అంతుపట్టని ప్రశ్న. ఇక్కడ నిబంధనలు పనిచేయవు, కారణాలు అసలు అడగరు ఎందుకంటే అంతా ‘మామూలు’గా వదిలేస్తారు. విద్యుత్​ ఎంత వినియోగం జరుగుతుందో ట్రాన్స్​కో అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అక్రమ వ్యాపారంతో విద్యుత్​ చౌర్యానికి పాల్పడడమే కాకుండా బట్టీల నిర్వహణకు అవసరమైన మట్టిని సమీపంలోని చెరువులు, కుంటల నుంచి రాత్రి సమయంలో ట్రాక్టర్ల ద్వారా తరలించి డంప్​ చేస్తున్నారు. వాస్తవానికి నల్లమట్టి తరలించాలంటే మైనింగ్​ అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ బట్టీ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలతో మాకేంటి.. మా రూటే సప‘రేటు’.. మేము ఏది చెబితే దానికి అధికారులు తలాడించాల్సిందే అంటూ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

అనుమతులు నిల్​..
రాష్ర్ట ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇటుక బట్టీలు నిర్వహించాలంటే ముందుగా మైనింగ్​ శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాలి. బట్టీ నిర్వహించే ప్రాంతం నుంచి ఆ గ్రామ పంచాయతీ నుంచి ఎన్​వోసీ తీసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు బట్టీ నిర్వహిస్తారు, ఎంత మంది కూలీలు పనిచేస్తున్నారు, వారికి కల్పించే మౌలిక వసతులను పరిశీలించిన అనంతరం పంచాయతీ నుంచి అనుమతి ఇవ్వాలి. అంతేకాకుండా ఇటుక తయారీకి సెస్సు చెల్లించాలి. వ్యవసాయ భూమిలో బట్టీ నిర్వహించాలంటే ఆ భూమిని వ్యవసాయేతర భూమిగా ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ఇవన్నీ పరిశీలించిన తరువాత పంచాయతీ నుంచి ఎన్​వోసీ ఇవ్వాల్సి ఉంటుంది. పంట పొలాల మధ్య బట్టీలు నిర్వహించకూడదు, బూడిదను ఇటుక బట్టీల నుంచి ప్రతిరోజూ తరలించాలి. ఇలా అన్ని నిబంధనలు బట్టీ నిర్వాహకులు పాటించాలి. కానీ మండలంలో నిర్వహిస్తున్న బట్టీల్లో ఎక్కడా ఈ నియమాలు పాటించిన దాఖలాలు కనిపించవు.

శ్రమ దోపిడికి గురవుతున్న వలస కార్మికులు
బట్టీల్లో పనిచేసే కార్మికులు అస్సాం, ఒడిస్సా రాష్ర్టాల నుంచి కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి జీవనోపాధిని వెతుకుంటున్నారు. అటువంటి వారిని ఆసరాగా చేసుకొని బట్టీల యాజమాన్యాలు చెల్లిస్తున్న కూలీ అంతంత మాత్రమే. వారి శ్రమను దోచుకుంటున్న వ్యాపారులు కూలీ తక్కువ పని ఎక్కువ చేయించు కుంటున్నారు. బట్టీల్లో మౌలిక వసతులు కల్పించక పోవడంతో పాటూ సరైన వేతనాలు ఇవ్వకపోవడంతో వారికి కనీస అవసరాలు తీరడం లేదని వాపోతున్నారు. వలస కార్మికుల బతుకులు బుగ్గిపాలవుతున్నా ఎవ్వరూ పట్టించుకోక పోవడంతో ఆంతర్యం ఏమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బట్టీలలో కార్మికులను పనిచేయించినప్పుడు కార్మికచట్టం నిబంధనల ప్రకారం ఎంతమంది పనిచేస్తారో వారందరికీ ఇన్సూరెన్స్​ చేయించాలి. వారి పిల్లల చదువుల కొరకు ప్రత్యేక మైన ఏర్పాట్లు చేయాలి. ఇవన్నీ అమలవుతున్నాయా..? లేదా….? అనేది అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుండాలి. మరి అలాంటిదేమైనా అమలవుతుందా అంటే లేదనేది స్పష్టమవుతుంది. అసలు పంచాయతీ కార్యదర్శి కానీ, రెవెన్యూ ఇన్​స్పెక్టర్​, కానీ, తహసీల్దార్​ కానీ అసలు జుజ్జులరావుపేటలో ఇటుక బట్టీలకు అన్నీ అనుమతులు ఉన్నాయా అంని అడిగితే..అసలు అక్కడ బట్టీలు నిర్వహించేదే తమకు తెలియదనడంలో ఆంతర్య మేమిటో అధికారులంతా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకుని శ్రమదోపిడీకి గురవుతున్న కార్మికులకు తగిన వేతనం లభించేలా, వారి జీవితాలకు భరోసా కల్పించే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

3 comments

  1. médicaments pour un traitement sans interruption sandoz Villa Adelina Pharmacie en ligne fiable pour
    acheter du médicaments

  2. buying prescription drugs in mexico: mexican pharmacy – mexican pharmaceuticals online

  3. reputable mexican pharmacies online
    http://cmqpharma.com/# mexican drugstore online
    mexican online pharmacies prescription drugs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *