Sunday , May 26 2024

పార్లమెంట్ ఎన్నికల సజావుగా నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలి.

జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ రాహుల్ రాజ్.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి మార్చి 18:

ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుల కోసం 24 గంటలు 1950 టోల్ ఫ్రీ నెంబర్ ,
ఏప్రిల్ 15 వరకు ఓటు హక్కు నమోదుపై విస్తృత ప్రచారం కల్పించాలి.సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చు.సాధారణ లోకసభ ఎన్నికల నేపథ్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్
భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సాధారణ పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని మెదక్ పార్లమెంట్ జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు.సోమవారం జిల్లా కలెక్టరేట్ విడియో కాన్ఫరెన్స్ హల్ లో రిటర్నింగ్ అధికారి/జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీ బాలస్వామి తో కలిసి జిల్లాలో ఎన్నికల నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ఎన్నికల కమిషన్ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిందని, ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వస్తుందని, ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 26 న నామినేషన్ల స్క్రూటినీ, ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, మే 13న పోలింగ్, జూన్ 4 న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని అన్నారు.
మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట,మెదక్ ,నర్సాపూర్,సంగారెడ్డి, పటాన్చెరువు,దుబ్బాక, గజ్వేల్ 7 అసంబ్లీ సెగ్మెంట్స్
లలో ఓటరు జాబితా సవరణ తుది ఓటరు జాబితా ప్రకారం 18 లక్షల 12 వేల 858 మంది ఓటర్లు,ఉన్నారని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో తమ పేరు సరిచూసుకోవాలని, జాబితాలో పేరు లేని వారు ఏప్రిల్ 15 వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన మేర పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఓటర్ కు రెండు కిలోమీటర్ల రేడియస్ లో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని, అవసరమైన మేర బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వివి ప్యాట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు.ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తయిందని,పోలింగ్ సిబ్బంది మొదటి రెండవ, తుది, రాండమైజేషన్ పార్లమెంట్ పరిధిలో ఉన్న మొత్తం ఎన్నికల సిబ్బంది తీసుకొని చేయడం జరుగుతుందన్నారు.ఎన్నికల కమిషన్ సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుండి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందని అన్నారు.
మతం,కులం, ప్రాంతంపై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడటం, తప్పుడు ప్రచారాలు చేయడంపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.రాజకీయ పార్టీలకు, నాయకులకు సమావేశాలు నిర్వహించు కునేందుకు సింగిల్ విండో సిస్టం ద్వారా అనుమతులు అందిస్తామని,ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీలులేదని అన్నారు. రాజకీయ సమావేశాలు ఆలయాలు, మసీదులు,చర్చిలు,ప్రార్థన స్థలాలల్లో, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో నిర్వహించరాదని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు జిల్లాలో ఎం.సి.సి., సర్వేలెన్స్ బృందాలను,ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను,వీడియో సర్వేలెన్సు బృందాలను, ఎం.సీ.ఎం.సీ కమిటీ, ఇతర కమిటీలను ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ఫిర్యాదులను ప్రజలు 1950 టోల్ ఫ్రీ,
నెంబర్ , ద్వారా, సి-విజల్ యాప్ ద్వారా చేయవచ్చని అన్నారు. జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదుల స్వీకరించేందుకు 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, సి -విజల్ యాప్ లో లైవ్ వీడియో అప్ లోడ్ చేసిన 100 నిమిషాల గడువులోపు అధికారులు క్షేత్రస్థాయిలో చేరుకొని ఫిర్యాదు పై చర్యలు తీసుకుంటారని అన్నారు.
రాజకీయ పార్టీలకు సంబంధించిన వాల్ రైటింగ్, ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో 24 గంటల వ్యవధిలో, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ పెట్రోల్ బంక్ మొదలైన పబ్లిక్ ప్లేస్ లలో 48 గంటల వ్యవధిలో, అనుమతి లేని ప్రైవేట్ స్థలాలలో 72 గంటల వ్యవధిలో పూర్తి స్థాయిలో తొలగిస్తామని కలెక్టర్ తెలిపారు.జిల్లాలో కరపత్రాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ముద్రించే సమయంలో ప్రింటింగ్ ప్రెస్ ఫోన్ నెంబర్, అదేవిధంగా ఎవరు ప్రింట్ చేయమన్నారు వారి ఫోన్ నెంబర్ తప్పనిసరిగా పేర్కొనాలని , ఈ అంశాన్ని అన్ని ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించి వివరించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంగిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, వీటిని పరిగణలోకి తీసుకొని సజావుగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఎస్పీ బాలస్వామి మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో నాలుగో విడతలో పోలింగ్ జరుగుతుందని తెలిపారు.
అక్రమ నగదు, లిక్కర్ సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో అవసరమైన మేర చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, 24 గంటలపాటు గట్టి నిఘా ఉంచామని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ఎన్నికల దృష్ట్యా ప్రజలు ఆధారాలు లేకుండా 50 వేలకు మించి నగదు తో ప్రయాణించవద్దని, ప్రతిరోజు తనిఖీలలో జప్తు చేసిన సొమ్మును జిల్లా లో ఏర్పాటు చేసే గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామని, ఆధారాలు సమర్పించి గ్రీవెన్స్ కమిటీ నగదు విడుదల చేస్తుందని తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు,ఇతర అధికారులు
తదితరులు పాల్గొన్నారు.